పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం
గద్వాల: పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 145 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, 300 పడకల ఆస్పత్రి, గురుకుల పాఠశాలలు, ప్రధాన రహదారులు, సీసీరోడ్లు, డ్రయినేజీ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా పేదలకు ఏదైనా సమస్య తలెత్తితే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించి గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు బోయ వెంకట్రాములు, జంబు రామన్‌గౌడ్, చెన్నయ్య, రమేశ్ నాయుడు, సుభాన్, బండారి భాస్కర్, బాబర్ పాల్గొన్నారు.


