‘ఉపాధి హామీ’ పేరు మార్పు సరికాదు
కేటీదొడ్డి: అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి చేకూర్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగించడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అన్నారు. గురువారం కేటీదొడ్డిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ పేరు ఉపాధి హామీ పథకానికి ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి కానీ.. ఉన్న పథకం పేరు రద్దు చేయడం సరికాదన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగానే గాంధీజీ పేరు తొలగించిందని ఆరోపించారు. ఈ నెల 26న ప్రతి గ్రామపంచాయతీలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. తీర్మాన ప్రతులను రాష్ట్రపతికి పంపిస్తామన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సర్పంచ్ నారాయణ, నాయకులు ఉరుకుందు, గోవిందు, కొండన్న, యుగందర్, శేఖర్‌రెడ్డి ఉన్నారు.


