‘ప్రమాదం.. ఓ కుటుంబం చిన్నాభిన్నం’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రమాదం.. ఓ కుటుంబం చిన్నాభిన్నం’

Jan 22 2026 7:04 AM | Updated on Jan 22 2026 7:04 AM

‘ప్రమ

‘ప్రమాదం.. ఓ కుటుంబం చిన్నాభిన్నం’

గద్వాల: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. బుధవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘చేరుకోండి.. జీవించండి’ నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ముఖ్యంగా అధికారులు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు రోడ్డు నియమాలు పాటించి, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అదేవిధంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో నిర్మించే రహదారులను నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు.

అతి వేగం కారణమే..

తాను హైదరాబాద్‌లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎండీగా పనిచేసిన సందర్భంలో అక్కడ జరిగే ప్రమాదాలకు కారణాలను విశ్లేషించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా స్పీడ్‌ లిమిట్‌లో వెళ్లే మార్గాల్లో వాహనదారులు అందుకు విరుద్ధంగా అధిక స్పీడ్‌తో వెళ్తూ ప్రమాదాల బారిన పడేవారన్నారు. అదేవిధంగా సడన్‌ బ్రేకులు వేయడం, రహదారులపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలపడం వంటివి ప్రమాదాలకు కారణాలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తే ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి వాటితోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణలో రవాణాశాఖ, ట్రాఫిక్‌, పోలీసు శాఖల అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

బాధ్యతతోనే ప్రమాదాల నివారణ

పౌరులు బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. రోడ్డు భద్రత ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయమని, రోడ్డు ప్రమాదంలో పోయే ఒక ప్రాణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. ఇంటి యజమాని వారి పిల్లలు, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేస్తే చాలా వరకు ప్రమాదాలు కట్టడి అవుతాయన్నారు. అదేవిధంగా ప్రతిఉద్యోగి ద్విచక్రవాహనంపై వచ్చే టప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. అనంతరం ‘చేరుకోండి.. జీవించండి’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలె క్టర్‌ నర్సింగ్‌రావు, అదనపు ఎస్పీ శంకర్‌, ఆర్డీఓ అలివేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘ప్రమాదం.. ఓ కుటుంబం చిన్నాభిన్నం’ 1
1/1

‘ప్రమాదం.. ఓ కుటుంబం చిన్నాభిన్నం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement