సామాజిక సేవలు అభినందనీయం
● వనపర్తిలో ఎస్‌బీఐ రీజనల్ కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయిస్తాం
● నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి
అలంపూర్: ఎస్‌బీఐ సామాజిక సేవలు అభినందనీయమని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. మానవపాడు మండలంలో ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులుశెట్టి దత్తత తీసుకున్న పెద్దపోతులపాడు, చిన్నపోతులపాడు, చెన్నిపాడు, బొంకూరు, గోకులపాడు గ్రామాల్లో మంగళవారం ఎస్‌బీఐ ఫౌండేషన్, భవిష్య భారత్ స్వచ్ఛంధ సంస్థ అధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించగా.. ఎంపీతో పాటు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే విజయుడు, ఎస్‌బీఐ సీజీఎం రాధాకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ముందుగా పెద్ద పోతులపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో కల్నల్ సంతోష్‌బాబు యువ శిక్షణ కేంద్రంలో క్రీడలు, ఇతర అంశాలపై శిక్షణ తీసుకుంటున్న యువతతో అతిథులు మాట్లాడారు. అనంతరం సంచార పశువైద్య సేవలు అందించే శాలిహోత్ర ఎక్స్‌ప్రెస్ వాహనం, వ్యర్థాల సేకరణకు వినియోగించే స్వచ్ఛత సాథీ వాహనాన్ని ప్రారంభించారు. చెన్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించి.. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. పెద్దపోతులపాడు, చిన్నపోతులపాడు, చెన్నిపాడు, బొంకూరు, గోకులపాడు గ్రామాల్లో రూ. 4 కోట్లు వెచ్చించి.. విద్య, వైద్య, ఇతర రంగాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులుశెట్టి స్వగ్రామం పెద్దపోతులపాడుతో పాటు చుట్టుపక్కల మరో నాలుగు గ్రామాల్లోనూ ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ స్వగ్రామంలోనూ ఎస్‌బీఐ ఫౌండేషన్ సేవలు ప్రారంభించాలని కోరారు. ధరూరు, ఎరవ్రల్లి చౌరస్తాలో కొత్తగా ఎస్‌బీఐ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వనపర్తిలో ఎస్‌బీఐ రీజనల్ కేంద్రం ఏర్పాటుకు స్థలం కావాలని చైర్మన్ అడిగితే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు. త్వరలోనే రూ. 25కోట్ల విలువైన స్థలాన్ని ఉచితంగా అందజేస్తామని తెలిపారు.
● కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లా నుంచి ఎస్‌బీఐ చైర్మన్‌గా శ్రీనివాసులు శెట్టి ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పెద్దపోతులపాడులో పాఠశాల అభివృద్ధితో పాటు స్థానిక యువత ఆర్మీ, పోలీస్ ఉద్యోగాల్లో ప్రతిభ చాటేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్మించేందుకు రూ. 12లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
● ఎస్‌బీఐ సీజీఎం రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల సహకారంతో ఎస్‌బీఐ ఫౌండేషన్ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌బీఐ చైర్మన్ స్వగ్రామంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, భవిష్య భారత్ స్వచ్ఛంద సేవాసంస్థ మేనేజింగ్ ట్రస్టి హరిప్రసాద్, ఎస్‌బీఐ ఫౌండేషన్ సీఈఓ స్వపన్ ధర్, ఫౌండేషన్ అధ్యక్షుడు జగన్నాథ్ సాహో, రీజినల్ మేనేజర్ సునీత, భవిష్య భారత్ డైరెక్టర్ హేమంత్ కుమార్, గ్రామసేవ కోఆర్డినేటర్ సిద్ధ లింగేష్, సర్పంచ్ రజాక్ పాల్గొన్నారు.


