దాశరథి ఆత్మలో తెలంగాణ
వనపర్తిటౌన్: నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అని వెలుగెత్తి చాటిన దాశరథిని జైలులో నిర్బంధించినా గర్జించే రచనలు చేశారని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్‌హాల్‌లో దాశరథి కృష్ణమాచార్య శతజయంతి వేడుకలను సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించగా.. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దాశరథి ఆత్మలో తెలంగాణ భాగమైందని కొనియాడారు. ఆయన రచనలు బీఆర్‌ఎస్ ఆవిర్భావంతో గోడలపై నినాదాలుగా వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. మహనీయులకు జన్మనిచ్చిన గడ్డ.. సాహిత్య శిఖరం సురవరం ప్రతాపరెడ్డి పుట్టిన గడ్డ వనపర్తి అని ప్రశంసించారు. సంక్లిష్ట సమాజంలో నిలబడి నిజాం పోకడలను ఎత్తిచూపారని గుర్తుచేశారు. రైతాంగ పోరాట ఉద్యమం వెలుగులోకి రావడంతో తెలంగాణ గురించి ప్రపంచానికి తెలిసిందన్నారు. బీఆర్‌ఎస్ పాలన పాలమూరును పచ్చని పంటల కల్పవల్లిగా తీర్చిదిద్దిందని వివరించారు. నిరంజన్‌రెడ్డి మళ్లీ వస్తేనే వనపర్తిలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉన్నంత కాలం చరిత్రలో దాశరథి పేరు చిరస్థాయిగా ఉంటుందని, అనతి కాలంలోనే ప్రభావితమైన రచనలు చేసిన కవిగా దాశరథి తెలంగాణలో గుర్తుండిపోయారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంతో దాశరథికి నిజమైన నివాళులర్పించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు కవులను దేశపతి శ్రీనివాస్, నిరంజన్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్, కవులు, వీరయ్య, నాగవరం బలరాం, బైరోజు చంద్రశేఖర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.
జైలులో నిర్బంధించినా
రచనలు ఆపలేదు
ప్రముఖ కవి, గాయకుడు,
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్


