గద్వాలటౌన్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 7,717 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 117 మంది ఉన్నారు. పది పరీక్ష రాసే వారిలో మొత్తం 3,851 మంది విద్యార్థులు బాలురు కాగా, 3,866 మంది బాలికలున్నారు. పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నాతధికారులు ప్రకటించారు. ఇందుకోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ వద్ద ఉన్న పాత బస్‌పాస్, లేదా పదో తరగతి హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఆర్టీసీ ఇప్పటికే రూట్ మ్యాపింగ్ ప్రణాళికను తయారు చేసింది.
సీసీ కెమెరాల నిఘాలో..
ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలోనే ప్రశ్నపత్రాల కవర్లను తెరవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాలలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును అధికారులు పరిశీలించారు. పోలీసు స్టేషన్లకు దూరంగా ఉన్న ‘సీ’ సెంటర్ల నుంచి ప్రశ్న పత్రాలను తరలించేందుకు పోలీసు ఎస్కార్టుతో ప్రత్యేక వాహనాలను కేటాయించారు. విద్యార్థులు, సిబ్బంది పరీక్ష కేంద్రం లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు అనుమతించరు.
పటిష్ట బందోబస్తు
కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులతో పది పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలను తరలించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించి ఉండాలి.
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
హాజరుకానున్న 7,717 మంది ద్యార్థులు
మొత్తం 40 పరీక్ష కేంద్రాలు.. 430 మంది ఇన్విజిలేటర్లు
జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు
ప్రశాంతంగా రాయండి
జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే డిబార్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
– బీఎం సంతోష్, కలెక్టర్