మల్దకల్: ఉపాధిహామీలో భాగంగా జాబ్ కార్డులు లేని కూలీలందరికి జాబ్‌కార్డులు అందించి పని కల్పించాలని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని తాటికుంట, పెద్దొడ్డి, మల్దకల్, అమరవాయి, బూడిదపాడు గ్రామాలను మోటార్‌సైకిల్‌పై కలెక్టర్ వెళ్లి అక్కడ చేపడుతున్న సీసీ రోడ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, నర్సరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్దొడ్డి గ్రామంలో ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా నర్సరీతోపాటు ఉపాధిలో భాగంగా చేపడుతున్న ప్రదేశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. కూలీలకు అందుతున్న బిల్లులు, పనులు చేసిన రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఉపాధి పనుల వద్ద నేమ్‌బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాలలో చేపడుతున్న సీసీ రోడ్లను పరిశీలించి పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ బషీర్, ఎంపీఓ రాజశేఖర్, ఏపీఓ సుజాత, టెక్నికల్ అసిస్టెంట్లు నాగరాజు, ఉమేరా, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్
మోటార్‌సైకిల్‌పై వెళ్లి క్షేత్రస్థాయి పనుల పరిశీలన