కేంద్రాలకు చేరని గన్నీ సంచులు
దళారుల చేతుల్లోకి ధాన్యం..
మొదలైన వరికోతలు
భూపాలపల్లి రూరల్: ఆరు నెలలు శ్రమించి, ఎల్‌నినో పరిస్థితులను ఎదురించి వరి పండించిన రైతులు చివరకు దిగుబడి అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో సేకరణ జరగడం లేదు. వరి కోతలు మొదలైన సమయంలోనే కేంద్రాలను ప్రారంభించిన్పటికీ చాలా చోట్ల కొనుగోళ్లు చేపట్టడంలేదు. అవసరమైన గోనె సంచులు కేంద్రాలకు చేరకపోవడం, తూకం వేసేందుకు హమాలీలు రాకపోవడంతో కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు నిరాశ చెందుతున్నారు. కేంద్రాల ప్రారంభానికి చూపిన ఉత్సాహం కొనుగోళ్లకు చూపడంలేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకే ధాన్యం విక్రయిస్తూ నష్టపోతున్నారు.
మద్దతు ధర, బోనస్‌పై ఆశలు..
ఈ వానాకాలంలో సన్న రకం వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.2,461 మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో జిల్లాలో చాలామంది రైతులు సన్న రకాల వైపు మొగ్గు చూపారు. మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటాకు రూ.2,961 వస్తుందని ఆశించారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో తూకాలు ప్రారంభం కాకపోవడంతో వారి ఆశలు నెరవేరడం లేదు.
సౌకర్యాలుంటేనే కొనుగోలుకు అనుమతి
కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంచినీరు, టెంట్/పందిరి, మాశ్చర్‌మిషన్, కాంటా తదితర 16 సౌకర్యాలు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటేనే కొనుగోలుకు అనుమతి వస్తుంది. కొనుగోలు చేసిన వెంటనే సమీపంలోని ఏ మిల్లులకు ధాన్యం పంపించాలో ఆన్‌లైన్‌లో స్పష్టంగా చూపిస్తుంది. కానీ నిర్వాహకులు పట్టించుకోవడంలేదనే వాదనలు ఉన్నాయి.
170 కేంద్రాలు..
1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా 170 కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ ప్రణాళిక రూపొందించింది. నవంబర్ 1 నుంచే కేంద్రాలు ప్రారంభించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశశాలు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే 35 కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ కొనుగోళ్లు జరగలేదు.
చిట్యాల మండలం, దూత్‌పల్లిలో
మిల్లర్లకు తరలిస్తున్న ధాన్యం
కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం
ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కొనుగోలు కేంద్రాలకు గన్నీ సంచులు చేరకపోవడంతో సేకరణకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కొనుగోళ్లు ఎలా ప్రారంభిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. 17 లక్షల గోనె సంచులు, తేమ శాతం పరీక్షించే యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని సివిల్ సప్లయీస్ డీఎం రాములు వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల్లో జాప్యం రైతులను ప్రైవేట్ వ్యాపారుల వైపు మళ్లిస్తోంది. పెట్టుబడులు, కూలీల ఖర్చులు, యంత్రాల అద్దెలు, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు ధాన్యం ఎక్కువ రోజులు కల్లాల్లో నిల్వ చేయలేకపోతున్నారు. అప్పులు తీర్చాల్సి ఉండడంతో తక్కువ ధరకై నా ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించి అప్పులు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు, ప్రైవేట్ వ్యాపారులు ఇస్తున్న ధరకు మధ్య వ్యత్యాసం ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఉంటుందని రైతులు వాపోతున్నారు.
ప్రారంభం కాని ధాన్యం కొనుగోళ్లు
కేంద్రాలకు చేరని గన్నీ సంచులు
దళారులను ఆశ్రయిస్తున్న రైతులు


