కాళేశ్వరం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేడు (బుధవారం) కాటారం డివిజన్ పరిధిలోని కాటారం, మహదేవపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రూ. 65 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, 2:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అగ్నిమాపక కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కాటారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్‌రావు, పలిమెల మండలాల పరిధిలోని అన్ని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 2,204 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లను మంత్రి పంపిణీ చేయనున్నారు. అలాగే, ఈ ఐదు మండలాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి అందజేయనున్నారు.
ఇంటి పన్ను చెల్లిస్తేనే
ఇందిరమ్మ బీమా?
మహాముత్తారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ బీమా కార్యక్రమం మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఇంటిపన్ను చెల్లిస్తేనే బీమా సౌకర్యం కల్పిస్తామని మండలంలోని బోర్లగూడెం పంచాయతీ కార్యదర్శి ఇంటిపన్ను వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి సుమారు 200 మంది వద్ద ఇంటిపన్ను వసూలు చేసినట్లు సమాచారం. మండలంలో అన్ని గ్రామపంచాయతీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీమా నమోదు ప్రక్రియ సాగుతుండగా బోర్లగూడెంలో మాత్రం ప్రజలనుంచి ఇంటిపన్నులు చెల్లించాలని నిబంధనల విధించడం పై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా.. ఇంటిపన్ను చెల్లిస్తేనే బీమా చేస్తామని తాము ఎవరినీ బలవంతం చేయడంలేదని, వారు ఇష్టంగా ఇస్తేనే పన్నులు తీసుకుంటున్నామని చెప్పడం గమనార్హం.
జాతీయస్థాయి కబడ్డీ
పోటీలకు సంజనశ్రీ
చిట్యాల: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని సంగి సంజనశ్రీ జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీజ మంగళవారం తెలిపారు. భద్రాది కొత్తగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన సంజనశ్రీ జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈనెల 26 నుంచి 29 వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగే 52వ జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సంజనశ్రీను ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీజ, వైస్ ప్రిన్సిపాల్ మాలతీలత, పీడీ మ్యాదరి వెన్నెల, పీఈటీ శారద, ఉపాధ్యాయులు అభినందించారు.
జిల్లా మారినా..
బోర్డు మార్చలేదు
టేకుమట్ల: ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా.. చిట్యాల మండలం ఉమ్మడి వరంగల్‌లో అంతర్భాగం. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం పరిపాలన సౌలభ్యంకోసం జిల్లాల పునర్విభజన జరిగింది. అనంతరం చిట్యాల మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి టేకుమట్ల నూతన మండలంగా 2016లో ఏర్పడింది. ఇవన్నీ సుమారు పుష్కరకాలం నుంచి జరుగుతున్న మార్పులు.. ఇంత జరుగుతున్నా.. టేకుమట్ల మండలంలోని విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సుబ్బక్కపల్లి ప్రాథమిక పాఠశాల బోర్డుపై వరంగల్ జిల్లా, చిట్యాల మండలం అని ఉండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నూతన జిల్లా, మండలం పేరును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


