ఇక.. ‘ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ’ | - | Sakshi
Sakshi News home page

ఇక.. ‘ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ’

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

సాక్షి, వరంగల్‌: ఉత్తర తెలంగాణ ప్రజలకు దశాబ్దాలుగా వైద్య సేవలందిస్తున్న వరంగల్‌ మహాత్మా గాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రి పేరుతో నే నగరంలో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందించనుంది. ఈ మేరకు నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏడు దశాబ్దాలకు పైగా వరంగల్‌ వైద్య చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎంజీఎం పేరు కొత్త ఆస్పత్రికీ కొనసాగనుంది. సుమారు 35 వైద్య విభాగాలు, 35 ఆపరేషన్‌ థియేటర్లు, 2,250 వరకు బెడ్లతో ఈ కొత్త ఆస్పత్రి సేవలందించనుంది.

71 ఏళ్ల వైద్య సేవల ప్రస్థానం...

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1955, నవంబర్‌ 1న ప్రారంభమైన ఈ ఆస్పత్రి అప్పటినుంచి నిరంతరాయంగా వైద్య సేవలందిస్తోంది. వరంగల్‌తోపాటు ఉమ్మడి జిల్లాలు, పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. కాలక్రమంలో వైద్య సేవలు, పడకలు, విభాగాలు పెరిగినా ఎంజీఎం పేరు మాత్రం ప్రజల నిత్యజీవితంలో భాగమైంది. వందల పడకలతో ప్రారంభమైన ఈ పాత ఆస్పత్రి నేడు 1,500కుపైగా బెడ్లతో సేవలందిస్తోంది. పాత ఆస్పత్రిపై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించడంతోపాటు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కొత్త సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించింది. తొలుత వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా వ్యవహరించినప్పటికీ తాజాగా ఎంజీఎం పేరు ఖరారు చేశారు. పాత ఆస్పత్రి పేరును కొనసాగించడం ద్వారా దాని చారిత్రక గుర్తింపునకు ప్రాధాన్యం ఇచ్చినట్లయింది.

నాలుగైదు రోజుల్లో మంత్రి పర్యటన..

కొత్త ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక దృష్టి సారించారు. ఓపీ, ఇన్‌ పేషెంట్‌ విభాగాలతోపాటు కిచెన్‌, టాయిలెట్లు, అగ్నిమాపక భద్రత, సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు నాలుగైదు రోజుల్లో వరంగల్‌కు రానున్నారు.

24 అంతస్తుల బడా ఆస్పత్రికి

నామకరణం

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే 71 ఏళ్లుగా సేవలందిస్తున్న ఎంజీఎంహెచ్‌

1955 నవంబర్‌ ఒకటి నుంచి

నిరాటంకంగా సేవలు

అదే పేరుతో ఇప్పుడు కొత్త ఆస్పత్రిలో సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement