విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఏది?

భూపాలపల్లి అర్బన్‌: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో మెస్‌ నిర్వహణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వందలాది మంది విద్యార్థుల ఆరోగ్య భద్రతతో ముడిపడి ఉన్న మెస్‌ నిర్వహణలో కనీస నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మెస్‌ నిర్వహిస్తున్న వ్యక్తికి కనీసం ఫుడ్‌ లైసెన్స్‌ కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ హాస్టళ్లలో మెస్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించేటప్పుడు నిర్దేశిత అర్హతలు, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆసక్తిగలవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హతలు పరిశీలించిన అనంతరం పారదర్శకంగా నిర్వహణ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, భూపాలపల్లి మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల ప్రమేయం లేకుండానే నిర్వహణ?

హాస్టల్‌లోని ఫుడ్‌ కమిటీలో ఉన్న విద్యార్థులను ఓ వ్యక్తి తనకు అనుకూలంగా మలుచుకుని మెస్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారుల అనుమతులు, పర్యవేక్షణ లేకుండానే ఈ వ్యవహారం కొనసాగుతోందా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు మెస్‌ నిర్వహణ బాధ్యతలు ఎవరికి, ఏ ప్రాతిపదికన అప్పగించారు. ఎంపిక ప్రక్రియ నిర్వహించారా.. నిర్వాహకుడి అర్హతలు, అనుమతులను పరిశీలించారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తనిఖీలతో వెలుగులోకి..

ఇటీవల ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వరుణ్‌రెడ్డి హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మెస్‌ నిర్వాహకుడి వద్ద కనీసం ఫుడ్‌ లైసెన్స్‌ కూడా లేకపోవడాన్ని గుర్తించిన ఇన్‌స్పెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అవసరమైన లైసెన్స్‌ లేకుండా మెస్‌ నిర్వహించడంపై సంబంధిత వ్యక్తికి నోటీసులు జారీ చేశారు.

హాస్టల్‌లో ఉంటూ చదువుకునే వైద్య విద్యార్థులకు ప్రతిరోజూ ఆహారం అందించే మెస్‌ నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం ఆందోళనకరం. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, వంటగది నిర్వహణ, ఆహార భద్రత ప్రమాణాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం నోటీసులు జారీ చేయడంతోనే ఈ వ్యవహారాన్ని ముగించకుండా, మెస్‌ నిర్వహణకు సంబంధించిన అనుమతులు, ఎంపిక ప్రక్రియ, నిర్వాహకుడి అర్హతలపై సమగ్ర విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలకు అనుగుణంగా మెస్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఫుడ్‌ లైసెన్స్‌ లేకుండానే మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో మెస్‌ నిర్వహణ

అధికారుల అనుమతులు, అర్హతల పరిశీలన లేకుండానే..

తనిఖీల్లో బయటపడిన నిబంధనల ఉల్లంఘన..

నిర్వాహకుడికి నోటీసులు

కలెక్టర్‌ విచారణ చేపట్టాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement