బుగులోని.. జనజాతర | - | Sakshi
Sakshi News home page

బుగులోని.. జనజాతర

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

చీకట్లోనే దర్శనం..

● పోటెత్తిన భక్తజనం..

ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు

● స్వామి వారికి ప్రముఖులు మొక్కులు

● మార్మోగిన గోవిందా నామస్మరణ

రేగొండ: రెండో తిరుపతిగా పేరుగాంచిన మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర మంగళవారం జోరుగా సాగింది. ప్రతీ ఏడాది కార్తీక పౌర్ణమి సమయంలో ఇక్కడ జాతర సాగుతుంది. ఈ మేరకు సోమవారం స్వామి వారిని తీసుకొవచ్చి గుట్టకింద కల్యాణం జరిపించారు. కాగా, భక్తుల గోవింద నామస్మరణతో బుగులోని గుట్ట మార్మోగింది.

భక్తుల మొక్కులు..

కొంగు బంగారం బుగులోని వెంకన్నకు కోరికలు నెరవేరిన భక్తులు తలానీలు సమర్పించారు. వాహనాలు, ఎడ్లబండ్లపై వచ్చి ఇప్పచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఈ క్రమంలో వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన సింగరవేణి శ్రీనివాస్‌ స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన వైద్యం సిబ్బంది సకాలంలో స్పందించి భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంగళవారం ఒక్క రోజే సుమారు యాభై వేలకు పైగా భక్తులు జాతరకు వచ్చినట్లు జాతర ఈఓ బిల్లా శ్రీనివాస్‌ వెల్లడించారు. కాగా, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పులకు చెందిన తడుక కిషన్‌ కోరికలు నేరవేరడంతో ద్విచక్ర వాహనంపై ఏనుగు ప్రతిమతో రావడం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, రేగొండ పీహెచ్‌సీ వైద్యాధికారి హిమబిందు ఆధ్వర్యంలో జాతర ప్రాంగణంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు.

మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు..

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి దంపతులు, మాజీ రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

జాతరలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకున్నా జాతర కమిటీ నిర్లక్ష్యంతో గర్భ గుడిలో నాసిరకం బల్బులు వాడడంతో పలుమార్లు కరెంట్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో గత్యంతరం లేక చీకట్లోనే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. కాగా, ఎస్పీ సంకీర్త్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ సంపత్‌రావు, సీఐలు కరుణాకర్‌ రావు, సతీశ్‌, ఎస్సై సుధాకర్‌తో పాటు 100 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement