ప్రవేశాలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాలకు వేళాయె..

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

జిల్లాలో ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభం

జూన్‌ 1 నుంచి కళాశాలలు

పునఃప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. జూన్‌ 1నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి విడత ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ప్రకటించింది. ప్రవేశాలు పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లావ్యాప్తంగా గతేడాది 3,778మంది విద్యను అభ్యసించారు.

విద్యార్థులకు అవగాహన..

ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన, వసతులు, అధ్యాపకుల వివరాలు, ఫలితాలను వివరిస్తూ ప్రవేశాలు పెంచుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు దీనిపై దృష్టి సారించారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఇంటర్‌ పరీక్షలు ముగిసిన నాటినుంచి కళాశాలల వారీగా వారి మండలాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి టెన్త్‌ పూర్తిచేసిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారం రోజులుగా ఊరూరా తిరుగుతూ పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. కళాశాలల్లో ఉన్న వసతులు, ప్రయోగశాలలు, అధ్యాపకులు తదితరలను వివరిస్తూ తమ కళాశాలల్లో ప్రవేశం పొందాలని అభ్యర్థిస్తున్నారు. గతేడాది కూడా ముందస్తు ప్రచారంతో కొంతమేరకు విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ కళాశాలల్లో చేరారు.

ఉచిత విద్య, వసతులు..

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించడంతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, మైదానాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటికి తోడు గురుకులాల్లో ఉచితంగా ఇంటర్‌ చదువుకునే అవకాశమున్నా ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలోని మోడల్‌ స్కూల్‌, కేజీబీవీల్లో చదువుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ మిగిలిన సీట్లను నిబంధనలకు అనుగుణంగా కొత్తవారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలను ఈసారి ఎక్కువగా పెంచుకునేందుకు అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ముందుకు సాగుతున్నారు.

జిల్లా కేంద్రంలో హాస్టల్‌ సౌకర్యాలు

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల పొందే బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్‌ వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దూర ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యను అందించేందుకు బాలబాలికలకు వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్‌ వసతులు అందుబాటులో ఉన్నాయి. హాస్టల్‌లో ప్రతీ రోజు టిఫిన్‌, రెండు పూటలా భోజన సౌకర్యాలు ఉంటాయని అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. కళాశాలల్లో సైతం ఈ ఏడాది నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 5

మోడల్‌ కళాశాలలు 6

కేజీబీవీ కళాశాలలు 10

బీసీ వెల్ఫేర్‌ కళాశాలలు 4

ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు 2

సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు 2

మైనారిటీ కళాశాల 1

ప్రైవేట్‌ కళాశాలలు 4

నాణ్యమైన విద్య..

ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఈ ఏడాది జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల భాగస్వామ్యంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టి ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. కళాశాలల్లో వసతులు, ఫలితాల గురించి కరపత్రాల ద్వారా వివరిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుంది. గతేడాది కంటే ఎక్కువ ప్రవేశాలు పొందేలా ముందుకు సాగుతున్నాం. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు కళాశాలలకు చేరుకున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థుల పాఠ్య పుస్తకాలు జూన్‌ రెండో వారంలోపు వచ్చే అవకాశం ఉంది.

– వెంకన్న, జిల్లా ఇంటర్‌ విద్యా నోడల్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement