అంత్య పుష్కరాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అంత్య పుష్కరాలకు ఆహ్వానం

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు రావాలని హైదరాబాద్‌లో పలువురు మంత్రులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికను శనివారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ అందజేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్కకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి వేముల శ్రీనివాస్‌లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. వారివెంట ఆలయ ఈఓ మహేష్‌, ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, వేదపారయనదార్‌ వైకుంఠ పాండాలు పాల్గొన్నారు.

ప్రలోభాలకు

లొంగొద్దు

అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల

భూపాలపల్లి రూరల్‌: మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురికావద్దని, డబ్బులు, ఉద్యోగాల ఆశ చూపించి మహిళలను, చిన్నపిల్లలను లొంగదీసుకుంటారని ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల సూచించారు,. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా బాధితులు, లైంగిక దోపిడీ అనే అంశంపై శనివారం పట్ణణంలోని సఖి కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి అఖిల హాజరై ప్రసంగించారు. వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మోసాలుచేసే అవకాశాలుంటాయని తెలిపారు. నేరాలు జరగకుండా కట్టడి చేయాలంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్‌ ప్లీడర్‌ బొట్ల సుధాకర్‌, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కంప అక్షయ, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపీఓ రాధిక, సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ గాయత్రి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సీనియర్‌ అసిస్టెంట్‌ సురేందర్‌ పాల్గొన్నారు.

డీజీపీని కలిసిన ఎస్పీ

భూపాలపల్లి అర్బన్‌: డీజీపీ సీవీ ఆనంద్‌ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులు, కాళేశ్వరం పుష్కరాల బందోబస్తు ఏర్పాట్లు, ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలపై ఎస్పీ వివరించారు. జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన డీజీపీ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

లారీ, కారు ఢీకొని

ముగ్గురికి తీవ్రగాయాలు

మల్హర్‌(కాటారం): లారీ–కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన కాటారం మండలం నస్తూరిపల్లి గ్రామ క్రాస్‌ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహదేవపూర్‌ వైపు నుంచి కాటారం వైపు వెళ్తున్న ఇసుక లారీ, కాళేశ్వరం వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన సురేందర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిని వెంటనే అంబులెన్స్‌ ద్వారా మహదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. గాయపడిన వారు రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement