● మూడు గురుకుల కళాశాలల్లో
50 మంది మాత్రమే చేరిక
ఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ములుగు జిల్లాలోని ఇంచెర్ల, ఏటూరునాగారం, కాటారం బాయ్స్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు కేవలం 50 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. సుమారు మూడు కళాశాలల్లో 300 వరకు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. కానీ కేవలం మూడు కళాశాలల్లో 50 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం గమనార్హం. గిరిజన గురుకుల కళాశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం, వసతి లేదనే అనుమానాలు గిరిజన విద్యార్థుల్లో నెలకొంది. దీంతో కళాశాలల్లో చేరేందుకు గిరిజన విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా, డివిజన్‌స్థాయి అధికారుల పర్యవేక్షణ గురుకులాలపై లేకపోవడంతో విద్యాబోధన సరిగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏటూరునాగారం బాలికల గురుకుల కళాశాలలో సైతం ఫుడ్ ఫాయిజన్ అయి కూడా చాలా మంది విద్యార్థినులు ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో విద్యార్థులను గురుకులాల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్‌సీఓ హరిసింగ్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందన కరువైంది.


