కలెక్టర్‌ను కలిసిన కాటారం ఆర్డీఓ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన కాటారం ఆర్డీఓ

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

భూపాలపల్లి అర్బన్‌: కాటారం ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన డి.రవీందర్‌ బుధవారం కలెక్టర్‌ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆర్డీఓ రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.

ఇద్దరు ఉద్యోగులపై చర్యలు

మొగుళ్లపల్లి: పీఏసీఎస్‌ సీఈఓ అప్పం సాగర్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ రాహుల్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్‌ మంగళవారం మొగుళ్లపల్లి పీఏసీఎస్‌కు చెందిన మొట్లపల్లి ధాన్యం సేకరణ కేంద్రం(పీసీసీ)లో తనిఖీ చేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు, ధాన్యం తూకం వేయకుండా సంబంధిత రైతులకు ధాన్యం కొనుగోలు రసీదులు జారీచేయకుండా ధాన్యం మిల్లులకు తరలించినట్లు తనిఖీలో నిర్ధారించారు. ఇతర అవకతవకలు వెలుగు చూశాయి. దీంతో మొట్లపల్లి పీసీసీ ఇన్‌చార్జ్‌ ప్రశాంత్‌ను విధుల నుంచి తొలగిస్తూ, సీఈఓ సాగర్‌పై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. మొగుళ్లపల్లి పీఏసీఎస్‌లో పనిచేస్తున్న ఎం. రమేశ్‌ను ఇన్‌చార్జ్‌ సీఈఓగా నియమిస్తూ, మొట్లపల్లి పీసీసీ సెంటర్‌లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా సత్వరమే మరొకరిని నియమించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగాలని.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగినా రైతులను ఇబ్బందులకు గురిచేసినా చర్యలు తప్పవన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

టేకుమట్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని వెంకట్రావుపల్లి శివారులో బుధవారం చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జనగాం కుమార్‌, హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల మండల కేంద్రానికి చెందిన రాజ్‌కుమార్‌ ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం అందించగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికి త్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement