‘ముందు’చూపు!
● మున్సిపోల్స్‌కు ముందస్తు ప్రచారం
● ఓటరు ఇంటి తలుపు తడుతున్న ఆశావహులు
● సమస్యలు తెలుసుకుని మరీ పరిష్కరించే ప్రయత్నం
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుండడంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. షెడ్యూల్ వెలువడకముందే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కనిపించనివారు ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఆశావహులు ఓటరు తలుపుతడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి రెడీ అయిన వారిలో చాలామంది వారం పది రోజులుగా గల్లీల్లో తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాట పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రిజర్వేషన్ కలిసిరాకుంటే ఏం చేయాలా అన్న దానికీ ప్లాన్‌బీతో రెడీగా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ వస్తే కుటుంబ సభ్యులను బరిలో దించాలన్న ఆలోచనతో ముందస్తుగానే ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా రంగంలోకి దిగేందుకు అవసరమైన డబ్బులను రెడీ చేసి పెట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతం ప్రచారం చేసుకునేందుకు ఫొటోలు, వీడియోలతో సిద్ధంగా ఉన్నారు.
పలకరిస్తూ.. పనులు చేస్తూ..
భూపాలపల్లి మున్సిపాలిటీలో తుది ఓటరు జాబితాలను ప్రకటించారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తితో ఉన్నవారంతా జనంబాట పట్టారు. ఒకరిద్దరు మాజీ కౌన్సిలర్లు ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తున్నారు. కొందరు డ్రెయినేజీలు శుభ్రం చేయించగా, మరికొందరు విద్యుత్ దీపాలు, పైపులైన్‌ల మరమ్మతులు చేయించడంపై దృష్టి సారించారు. ఇంతకాల ముఖం చూపని వారు పొద్దున లేవగానే గల్లీలు తిరుగుతూ అందరినీ పలకరిస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిన్నమొన్నటి దాకా పట్టించుకోని వారు ఎన్నికల లొల్లి మొదలవుతుందనగానే వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.
సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలతో..
మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఆలయాలు, చర్చిలు, మజీద్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, మాజీ కౌన్సిలర్ల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవాల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొని రోడ్డు పనులు తమ ద్వారానే జరుగుతున్నట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పనులను వేగవంతం చేశారు.
అప్పుడే తాయిలాలు..
జిల్లా కేంద్రంలో కొందరు ఆశావహులు సంక్రాంతి పండుగ కోసం రంగుల ప్యాకెట్లను ఇంటింటికీ పంపిణీ చేశారు. మరికొందరు వార్డుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందించారు. సంక్రాంతి పండుగ పూట మాంసం, మందు కూడా పంపిణీ చేశారు. వీలిన గ్రామాల్లో పండగ సందర్భంగా గ్రామాలకు వచ్చిన యువకులతో మాట్లాడి మంచి చెడులను చర్చించారు. ఓటు వేసేందుకు తప్పకుండా రావాలని మర్యాదులు సైతం చేశారు. వార్డుల్లో కమ్యూనిటీ బోర్లకు సంబంధించిన సంఘాలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు, అభివృద్ధి సంఘాలు, కాలనీ సంఘాల వారీగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారం భించారు.
‘ముందు’చూపు!


