‘మేడిగడ్డ’ పునరుద్ధరణ ఆలస్యం!
● పరీక్షల ఫలితాలకు ఏడాది దాటే
అవకాశం
● క్షేత్రస్థాయి పరీక్షలు పూర్తయ్యాకే
ముందడుగు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ పునరుద్ధరణకు మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలు, క్షేత్రస్థాయి పరీక్షల నిర్వహణలో జాప్యం కారణంగా పునరుద్ధరణ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. బ్యారేజీ నిరుపయోగంగా మారి ఇప్పటికే రెండేళ్లు పూర్తవుతున్నా, పునరుద్ధరణ ఎప్పుడవుతుందో ఇంకా స్పష్టత రావడం లేదు.
రేండేళ్లుగా..
మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న ఏడోబ్లాక్‌లోని 20వ పియర్ కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్లలో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి, అప్పటి నుంచి ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాలు, సూచనల మేరకు పలు పరీక్షలు నిర్వహించారు. మళ్లీ పునరుద్ధరణ చేపట్టడానికి పరీక్షలు చేయడానికి ఈనెలలో అడుగులు వేస్తున్నారని తెలిసింది.
డిజైన్స్ టెండర్లు..
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్వహించాల్సిన పరీక్షల అనంతరం చేపట్టే పనులకు అవసరమైన డిజైన్ల రూపకల్పన కోసం నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) డిజైన్ సంస్థలతో ఒప్పందాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ ఒప్పందాలు పూర్తయినా, క్షేత్రస్థాయిలో జరిగే పరీక్షలు పూర్తికాకపోతే పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
9 రకాల పరీక్షలు చేయడానికి సిద్ధం..
మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్‌లో ఇప్పటికే ఒక దఫా పరీక్షలు నిర్వహించిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) మరోసారి పూర్తి స్థాయిలో పరీక్షలు చేపట్టనుంది. ఏడో బ్లాక్‌తోపాటు మిగిలిన ఏడు బ్లాకుల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధానంగా జియో ఫిజికల్, జియో టెక్నికల్, ఎన్‌డీటీతోపాటు తొమ్మిది రకాల పరీక్షలు నిర్వహించడానికి సిద్ధం అయినట్లు అధికారుల ద్వారా తెలిసింది. పరీక్షలు 25 నుంచి 30 మీటర్ల లోతు వరకు బ్యారేజీ కింద భూమి స్వభావాన్ని అధ్యయనం చేయనున్నారు. దీంతోపాటు కాంక్రీటు పరిస్థితి, గేట్ల పనితీరు, ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్, జీపీఆర్, నాన్–డిస్ట్రక్టివ్ టెస్టులు సహా మొత్తం పది వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈనెల చివరి వారం లేదా ఫిబ్రవరిలో..
ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొన్ని పరీక్షల ఫలితాలు రావడానికి కనీసం ఆరు నెలలు కానుంది. మరికొన్నింటికి ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు సమయం పట్టే అవకాశం ఉండడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందని తెలిసింది. నీటి నిల్వ చేయడానికి బ్యారేజీలు వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కూడా సిద్ధంగా లేవని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావును ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది.


