3గంటలు ట్రాఫిక్ జామ్
● డ్రైవర్ నిర్లక్ష్యంతో 353(సీ)
జాతీయ రహదారిపై ట్రాఫిక్
● పునరుద్ధరించిన పోలీసు,
ఎన్పీడీసీఎల్ సిబ్బంది
కాళేశ్వరం: నిర్లక్ష్యంతో విద్యుత్ స్తంభాన్ని ట్యాంకర్ డ్రైవర్ ఢీకొట్టడంతో 353(సీ) జాతీయ రహదారిపై సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ నుంచి మహదేవపూర్ మండలం కాళేశ్వరం గుండా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న (సోడియం క్లోరైడ్ లాజిస్టిక్ కెమికల్) ట్యాంకర్ పలుగుల బైపాస్ క్రాస్ వద్ద నిలిపాడు. డ్రైవర్ ట్యాంకర్ నిలిపి కిరాణ దుకాణం వెళుతున్న క్రమంలో రివర్స్ తీస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ట్యాంకర్ ఒక పక్కకు ఒరిగింది. దీంతో రాత్రి ఎలాంటి ప్రమాదం జరుగొద్దనే ఉద్దేశంతో పోలీసు, ఎన్పీడీసీఎల్ సిబ్బంది అక్కడే ఉన్నారు. శుక్రవారం కన్నెపల్లి పంప్‌హౌస్ మెఘా కంపెనీకి చెందిన భారీ క్రేన్ సాయంతో పోలీసుల పహారా మధ్య లారీని తొలగించారు. ట్యాంకర్ ఢీకొన్న స్తంభంపై 11 కేవీ విద్యుత్ వైర్లు ఉండటంతో, భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు సుమారు 3 గంటల పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ కారణంగా అటు మహారాష్ట్ర, ఇటు వరంగల్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఇసుక లారీలు రహదారిపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం ట్రాఫిక్, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో రాకపోకలు యధావిధిగా జరిగాయి. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.


