పోరాటయోధుడు ఓబన్న
భూపాలపల్లి: స్వాతంత్య్ర పోరాటయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలు కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ అధికారి ఇందిర మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ధైర్య సాహసాలు ప్రదర్శించారన్నారు. ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షురాలు దారంగి మంజుల, శివరాత్రి రమేష్, మిర్యాల మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.
రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (సోమవారం) స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ ముల్కనూరి భిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
రేగొండ: అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లిగోరి ఎస్సై దివ్య ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన జూపాక రాధమ్మ ఇంటి వద్ద అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


