పది విద్యార్థులకు స్నాక్స్
ఫిబ్రవరి 16 నుంచి అందజేత
జిల్లాలో 2,739 మందికి ఉపయోగం..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ ప్రత్యేక క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు చిరుతిళ్లు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే నెల 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు 19 రోజులపాటు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో చదివే వారికి రోజుకో రకం స్నాక్స్ అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పిల్లలకు ఆకలి నుంచి ఉపశమనం లభించనుంది.
వంద శాతం ఉత్తీర్ణతకు..
మార్చిలో నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యాశాఖ గతేడాది దసరా సెలవులు ముగిసిన అనంతరం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. మొదట ఒక పూటతో ప్రారంభించగా.. డిసెంబరు నుంచి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి 9 గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 4.15గంటల నుంచి 5.15గంటల వరకు రోజూ రెండు గంటలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందుబాటులో ఉండడం లేదు. మధ్యాహ్న భోజనం తిన్న తరవాత సాయంత్రం ఖాళీ కడుపుతో ప్రత్యేక తరగతులు వినాల్సి వస్తోంది. ఇంటికి వెళ్లే సరికి చీకటి పడి ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. కాలే కడుపుతో ఉంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చెవికెక్కవు. దీన్ని గుర్తించిన విద్యాశాఖ పిల్లల ఆకలి తీర్చడానికి స్నాక్స్ అందించాలని నిర్ణయించింది.
జిల్లాలో 97 పాఠశాలలు,
2,739 మంది విద్యార్థులు
సాయంత్రం పూట అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు
జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు 97 ఉన్నాయి. వాటిలో 2,739 మంది విద్యార్థులు పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. చిరుతిళ్ల కోసం జిల్లాకు ప్రభుత్వం రూ. 3.50లక్షలు మంజూరు చేసే అవకాశం ఉంది. వీటితో రోజూ పెసర్లు, పల్లీలు, బెల్లం, చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బెర్లు, శనగలు, ప కోడి అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచే ప్రారంభిస్తే ప్రయోజనం ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
పది విద్యార్థులకు స్నాక్స్


