మార్కెట్‌పై నిఘా | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌పై నిఘా

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

● జనగామ మార్కెట్‌లో అక్రమాలకు

చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక బృందం

● ధాన్యం తూకాల నుంచి

వేలం ధరల వరకు తనిఖీలు

● మార్కెట్‌ లావాదేవీలపై అధికారుల

పర్యవేక్షణ,రికార్డుల పరిశీలన

● మార్కెట్‌ ఫీజుల వసూళ్లపైనా నజర్‌

● రోజువారీ తనిఖీలు, ఉన్నతాధికారులకు నివేదికలు

ముగ్గురు సభ్యులతో బృందం

మార్కెట్‌ తనిఖీ బృందంలో జనగామ డీఎంఓ సారంగపాణి, అడిషినల్‌ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి దివ్య, ఏఎంసీ ములుగు సూపర్‌వైజర్‌ రాజు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం కార్యకలాపాలను మార్కెటింగ్‌ శాఖ అదనపు సంచాలకుడు లక్ష్మణుడు పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మార్కెట్లకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేయగా.. జనగామకు చోటు కల్పించారు.

జనగామ: వ్యవసాయ మార్కెట్లలో లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడం, కొనుగోళ్లు, విక్రయాల్లో నిబంధనల అమలును నిర్ధారించడం, రికార్డుల్లో అవకతవకలకు తావులేకుండా చూడటంపై రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జనగామ మా ర్కెట్‌ను నిరంతరం తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు రాహుల్‌ రాజ్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

రోజువారీ నివేదికలతో పర్యవేక్షణ

తనిఖీ బృందాలు రోజువారీ నివేదికలను సంబంధిత టీమ్‌ లీడర్ల ద్వారా పర్యవేక్షణ అధికారులకు సమర్పించాలి. ఆ నివేదికలను పరిశీలించిన అధికారులు ప్రతీ మార్కెట్‌పై సంక్షిప్త నివేదికను మార్కెటింగ్‌ శాఖ సంచాలకుడికి అందించాలి. ప్రత్యేక అధికారుల బృందాలతో రోజువారీ సమన్వయం చేసుకోవడంతోపాటు, గుర్తించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే క్రమశిక్షణ చర్యల కోసం సంబంధిత ఫైళ్లను విజిలెన్స్‌ విభాగానికి పంపే అవకాశం కూడా సర్క్యులర్‌లో కల్పించారు.

వ్యాపారుల రికార్డులపైనా దృష్టి

కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు సమర్పించాల్సిన నెలవారీ కొనుగోలు రిటర్నులు, తక్‌పట్టీల వివరాలను ప్రత్యేక అధికారులు పరిశీలించి, నిబంధనల అమలుపై బృందాలకు మార్గనిర్దేశం చేయాలి. కోల్డ్‌ స్టోరేజీలు, చెక్‌పోస్టుల తనిఖీలకు అవసరమైనప్పుడు మార్కెట్‌ కమిటీల నుంచి అద్దె వాహనాలను సమకూర్చుకోవచ్చని, ఇందుకు 2026–27 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన బడ్జెట్‌ను కార్యాలయ నిర్వహణ కింద వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనగామ మార్కెట్‌లో సరుకుల రాకపోకలు, వేలం ధరలు, తూకాలు, కొనుగోలు రిటర్నులు, మార్కెట్‌ ఫీజుల వసూళ్లపై సమగ్ర తనిఖీ లకు ఈ ఆదేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. తనిఖీలు పూర్తన తర్వాత అన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.

రికార్డుల తనిఖీ.. తూకాల్లో పారదర్శకత

మార్కెట్‌కు వచ్చే సరుకులతోపాటు బయటకు వెళ్లే వివరాలు రిజిస్టర్లతో సరి పోల్చాలి. మార్కెట్‌ యార్డులతోపాటు కోల్డ్‌ స్టోరేజీల్లో నిర్వహించే వేలం, టెండర్‌ రిజిస్టర్లను పరిశీలించాలి. వేలం లేదా టెండర్‌లో నిర్ణయించిన ధరలకు, తక్‌పట్టీల్లో నమోదైన ధరలకు మధ్య వ్యత్యాసాలున్నాయా.. లేదా.. అనేది నిర్ధారించాలి. ధాన్యం తూకాలను రాకపోకల రిజిస్టర్లు, దడువాయి నమోదు చేసిన అసలు తూకంతో సరిపోల్చి, తక్‌పట్టీలు, నెలవారీ కొనుగోలు రిటర్నుల్లో నమోదైన వివరాలను తనిఖీ చేయాలి. నెలవారీ కొనుగోలు రిటర్నులు వేలం ధరలు, తూకాల వివరాలకు అనుగుణంగా ఉన్నాయా.. లేదా.. అన్నది కూడా బృందం పరిశీలించాలి. చెక్‌పోస్టుల వద్ద సరుకుల రవాణా వివరాలు, మార్కెట్‌ ఫీజు రశీదులు, ధరలు, తూకాల రికార్డులు, ఎగ్జిట్‌ రిజిస్టర్లను రోజువారీగా తనిఖీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement