● సంతోషంలో 2024 డీఎస్సీ ఉపాధ్యాయులు
● జిల్లాలో 220 మందికి కొలువులు
జనగామ: ఎన్నో ఏళ్ల నిరీక్షణ, పట్టుదల ఫలితంగా 2024 డీఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించినవారి కల నెలవేరి రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని శుక్రవారం తమ నియామక రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. కొత్త టీచర్ల రాకతో రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త కళ కనిపిస్తోంది. 2024 డీఎస్సీ ద్వారా జిల్లాలో 220 పోస్టులను భర్తీ చేయగా.. సుదీర్ఘకాలంగా డీఎస్సీ కోసం ఎదురు చూసి ఉద్యోగం పొందిన అభ్యర్థులు సంబురాలు జరుపుకున్నారు. 2024 అక్టోబర్ 9న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు, అదే నెల 16వ తేదీ నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరారు. కొత్త ఉపాధ్యాయుల నియామకంతో పాఠశాలల్లో బోధనా కార్యకలాపాలకు మరింత ఊతం లభించింది. లక్ష్యంతో ఉద్యోగం సాగించిన కృషి, నియామక పత్రాలు అందుకున్న క్షణాలు, తొలిసారి పాఠశాలలో అడుగుపెట్టిన అనుభూతులు తమకు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలుస్తాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.


