పోరాట ఫలితం ‘జనగామ’ | - | Sakshi
Sakshi News home page

పోరాట ఫలితం ‘జనగామ’

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

డిమాండ్లు

దశాబ్దకాలంలో జిల్లా అభివృద్ధికి బాటలు

జనగామ: ఎన్నో పోరాటాలు.. వందలాది ఆందోళనలు.. వేలాది మంది ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఆవిర్భవించిన జనగామ జిల్లా పదేళ్లు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెడుతోంది. జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించారు. సుమారు 500 రోజుల పాటు కొనసాగిన ఉద్యమంలో ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, అరెస్టులు చోటు చేసుకున్నాయి. 200 రోజులపాటు 144 సెక్షన్‌ అమలైనట్లు ఉద్యమకారులు గుర్తుచేసుకుంటున్నారు. 55 మంది జైలు జీవితం గడిపారు. చివరకు 2016 అక్టోబర్‌ 11న జిల్లా అధికారికంగా ఆవిర్భవించింది.

విద్య, వ్యవసాయంలో గణనీయమైన మార్పులు

జిల్లా ఏర్పాటుతో పాలన, వైద్యం, విద్య, వ్యవసా యం, విద్యుత్‌ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సుమారు రూ.80 కోట్లతో నూతన కలెక్టరేట్‌, రూ.100 కోట్లతో కోర్టు భవన నిర్మాణం చేపట్టారు. వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల, పీజీ వైద్య విద్య, చంపక్‌హిల్స్‌లో పీజీ కళాశాల భవనం, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌, తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌, రేడియాలజీ హబ్‌ వంటి సదుపాయాలు, క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి, షీ టీమ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జనగామ రైల్వేస్టేషన్‌ సుందరీకరణ చేశారు.

వ్యవసాయానికి జలకళ

గోదావరి జలాల రాకతో కరువు ప్రాంతంగా పేరున్న జనగామలో సాగునీటి ఆశలు చిగురించాయి. దేవాదుల కాల్వలు, రిజర్వాయర్ల అభివృద్ధితో సాగు విస్తీర్ణం లక్షన్నర ఎకరాలకు పైగా పెరిగింది. ధాన్యం సేకరణ రికార్డు స్థాయికి చేరింది. 62 రైతు వేదికలు, గోదాముల నిర్మాణం రైతులకు తోడ్పాటునందించాయి. చంపక్‌హిల్స్‌లో 400/220కేవీ సబ్‌స్టేషన్‌, ఇతర విద్యుత్‌ సబ్‌స్టేషన్లతో వోల్టేజీ సమస్యల నివారణకు చర్యలు చేపట్టారు. కొత్త మండలాల ఏర్పాటు, గురుకుల విద్యాసంస్థలు, పెంబర్తి హస్తకళలకు ప్రోత్సాహం జిల్లాకు గుర్తింపు తెచ్చాయి.

జిల్లాలో అభివృద్ధి పనులు ఇలా..

లింగాలఘణపురం: కుందారం–పాలకుర్తి రోడ్డులో పటేల్‌గూడెం వాగుపై రూ.2 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. జీడికల్‌ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు వేశారు.

కొడకండ్ల: రూ.250 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, ముండ్రాయి–కొడకండ్ల, వెలిశాల, పాలకుర్తి, నాంచారిమడూరు రోడ్ల ఆధునీకీకరణ.

స్టేషన్‌ఘన్‌పూర్‌: రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఆర్డీఓ కార్యాలయం, ఫైర్‌ స్టేషన్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు, రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ రెవెన్యూ కార్యాలయం పనులు, రూ.2.63 కోట్లతో ఇండోర్‌ స్టేడియం, దేవాదుల రిజర్వాయర్‌ లైనింగ్‌కు రూ.100 కోట్లు, మల్లన్నగండి కుడి కాల్వకు రూ.15 కోట్లు వెచ్చిస్తున్నారు.

జఫర్‌గఢ్‌: కోనాయిచలంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, రూ.4.50 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మించారు.

జనగామ రూరల్‌: జనగామ–హుస్నాబాద్‌ రోడ్డుపై రూ.2 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. ఎర్రగొల్లపాడు రోడ్డు పనులకు రూ.60 లక్షలు, చీటకోడూరు –యశ్వంతాపూర్‌ వాగుపై వంతెనలకు రూ.5 కోట్లు వెచ్చించారు.

రఘునాథపల్లి: దొడ్డిగుట్ట వద్ద రూ.3 కోట్లతో గోదాములు నిర్మించారు.

పాలకుర్తి టౌన్‌: సుమారు రూ.100 కోట్లతో పర్యాటక కారిడార్‌ అభివృద్ధి, సోమనాథుడి స్మృతివనం, కల్యాణ మండపం, బమ్మెరలో పోతన స్మృతి వనం, వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు, సుమారు రూ.400 కోట్లతో పాలకుర్తి, చెన్నూరులో రిజర్వాయర్ల పనులు. రూ.17.50 కోట్లతో 50 పడకల ఆస్పత్రి నిర్మాణం. ఫైర్‌ స్టేషన్‌, ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

జనగామ రూరల్‌, అర్బన్‌, ఆయా మండలాల పరిధిలో మరో 4 మండలాలుగా పెంచి విస్తరించాలి.

జిల్లాకు ఎస్‌పీ కార్యాలయం హోదా

కల్పించాలి.

ప్రభుత్వ ఐటీఐ, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి.

జనగామ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలి.

పెంబర్తి–వరంగల్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ కలగానే మిగిలిపోయింది.

11వ వసంతంలోకి అడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement