● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ఆరోగ్య, శ్రేయస్సు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమ అమలుపై సమీక్షించారు. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మరో 21 జిల్లాలకు విస్తరించగా అందులో జనగామ కూడా ఉందన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి, శిక్షణ అనంతరం హెల్త్ అండ్ వెల్నెస్ అంబాసిడర్లుగా కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రతీ వారం గంట పాటు విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ మంగళవారాన్ని ఆరోగ్యం, శ్రేయస్సు డేగా నిర్వహించి, నిర్దేశించిన 11 అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. యోగా, ధ్యానం, సురక్షిత తాగునీరు, రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, జీసీడీఓ గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.


