పాతాళంలో నీళ్లు.. పొలాలు బీళ్లు
మండలాల వారీగా భూగర్భ జలమట్టం(మీటర్లలో)
మడి దాటని నీరు!
జనగామ: వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో భూగర్భ జలమట్టం కొంత మెరుగుపడినప్పటికీ, గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే మాత్రం నీటిమట్టాలు గణనీయంగా లోతుకు పడిపోయాయి. జిల్లాలోని 37 ఫీజోమీటర్లలో నమోదైన వివరాల ప్రకారం సెప్టెంబర్–2026లో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 8.20 మీటర్ల లోతులో ఉంది. ఆగస్టులో 9.50 మీటర్లు ఉండగా, ఇటీవల కురిసిన వర్షాలతో 1.30 మీటర్లు నీటి మట్టంపైకి వచ్చినట్లు నమోదైంది. అయితే 2025 సెప్టెంబర్‌లో సగటు 4.79 మీ టర్లుగా ఉండటంతో, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 3.41 మీటర్లు లోతుకు వెళ్లింది.
అత్యల్పం..అత్యధికంగా లోతుకు
జిల్లాలోనే స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని నమిలిగొండ 1.48 మీటర్ల పైకి అత్యంత మెరుగైన స్థానంలో నిలవగా, జనగామ మండలంలోని సిద్దంకిలో 14.68 మీటర్ల లోతుకు పడిపోయాయి. జఫర్‌గఢ్ మండలంలోని సూరారం 13.85, రఘునాథపల్లి మండలంలోని గబ్బెటలో 13.19 మీటర్ల లోతులో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
సాగుకు నీటి కొరత.. రైతుల్లో ఆందోళన
జిల్లాలో వానాకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు కలిపి సుమారు 3.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వర్షాలు ఆలస్యంగా, తక్కువగా కురవడంతో ఇప్పటికే బోర్లు, బావులపై ఆధారపడిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 800 నుంచి 1,000 అడుగుల వరకు బోర్లు వేసినా ఆశించిన స్థాయిలో నీరు లభించని పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. దీంతో ఉన్న బోర్ల నుంచి కిలోమీటర్ల మేర పైపులు వేసి మడికి మడి నీటిని అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి పొలాలు ఎండిపోగా, పత్తిలోనూ దిగుబడి తగ్గే పరిస్థితి నెలకొంది. సాధారణంగా పత్తి కొమ్మకు 30–40 కాయలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 20 కాయలు కూడా కనిపించని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంటపైనా నీటి కొరత ప్రభావం పడుతోంది. వర్షాలు మరింతగా కురిసి భూగర్భ జలాలు రీచార్జ్ అయితేనే మిగిలిన పంటలకు ఊరట లభించే అవకాశం ఉంది.
తడారి పోతున్న పంటలు
పంటను కాపాడుకునేందుకు కష్టాలు
మడి మడికి పైపులు పెట్టి పారకం
ఇటీవల వర్షాలతో ఉపశమనం పాక్షికమే
జిల్లా సగటు నీటిమట్టం 8.20 మీటర్లు
గతేడాదితో పోలిస్తే 3.41 మీటర్లు లోతుకు
బచ్చన్నపేట (పడమటి కేశ్వాపూర్) 12.01
చిల్పూరు (కిష్టాజిగూడెం) 6.60
దేవరుప్పుల (మాధవాపురం) 10.76
స్టేషన్‌ఘన్‌పూర్ (చాగల్) 11.94
జనగామ (సిద్దెంకి) 14.68
కొడకండ్ల 10.47
లింగాల ఘణపురం (జీడికల్) 9.45
నర్మెట (మచ్చుపహాడ్) 7.65
రఘునాథపల్లి (గబ్బెట) 13.19
పాలకుర్తి (వల్మిడి) 11.58
తరిగొప్పుల (అక్కరాజుపల్లి) 13.02
జఫర్‌గఢ్ (సూరారం) 13.85


