చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

జనగామ రూరల్‌: చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్‌.ఎల్‌.నరసింహరావు, తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షుడు వేముల బాలరాజు, కుమ్మరి సంఘం అధ్యక్షుడు ఎద్నూరి బుచ్చయ్య, అభినాష్‌, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

‘రెడ్‌క్రాస్‌’ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడిగా వెంకట్‌ రెడ్డి

జనగామ రూరల్‌: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో లయన్‌ పప్పు వెంకట్‌ రెడ్డి మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఈసందర్భంగా వెంకట్‌ రెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా జిల్లాలో మానవతా సేవలను మరింత విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఉన్నత లక్ష్యాలను

ఎంచుకోవాలి

జనగామ రూరల్‌: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోని భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని ఇంటర్మీడియట్‌ విద్యాధికారి జితేందర్‌ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్‌ నాముని పావని కుమారి అధ్యక్షతన ఫస్టియర్‌ విద్యార్థులకు ఫ్రెషర్స్‌ డే నిర్వహించారు. ఈసందర్భంగా జితేందర్‌ రెడ్డి మాట్లాడు తూ.. కళాశాల విద్య భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. ఉత్తమ విద్యను పొంది అంకిత భావంతో చదివి వంద శాతం ఫలితాలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కళా శాల స్టాఫ్‌ సెక్రటరీ వై. శ్రీకాంత్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ ఎస్‌ కోఆర్డినేటర్‌ వస్కుల శ్రీనివాస్‌, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ మరిపెల్ల రవిప్రసాద్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఇన్‌ సర్వీస్‌ టీచర్ల టెట్‌లో 71.43శాతం ఉత్తీర్ణత

జనగామ: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లాలో 231 మంది ఉపాధ్యాయులు పరీక్షకు హాజ రుకాగా 165 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లాలో 71.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సబ్జెక్టుల వారీగా చూస్తే పేపర్‌–2 సోషల్‌ విభాగంలో అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. టెట్‌ పేపర్‌–1కు జిల్లాలో 43 మంది ఉపాధ్యాయులు పరీక్షకు హాజరుకాగా 29 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో సుమా రు 67.44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రాథమిక స్థాయి బోధనకు అర్హత సాధించేందుకు నిర్వహించిన ఈ పరీక్షలో ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన కనిపించింది. పేపర్‌–2లో మ్యాథ్స్‌, సైన్స్‌ విభాగానికి 97 మంది ఉపాధ్యాయులు హాజరుకాగా 69 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో సుమారు 71.13 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పేపర్‌–2 సోషల్‌ విభాగంలో 91 మంది పరీక్ష రాయగా 67 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఈ విభాగంలో సుమారు 73.63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో మూడు విభాగాల్లో కలిపి 231 మంది ఉపాధ్యాయులు పరీక్ష రాయగా 165 మంది అర్హత సాధించారు. ఇన్‌న్‌సర్వీస్‌ ఉపాధ్యాయులు టెట్‌ అర్హత సాధించడం ద్వారా తమ వృత్తిపరమైన అర్హతలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం లభించినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement