సాక్షి, మహబూబాబాద్ : ‘ఏ గ్రామంలో చూసినా భూ సమస్య కనిపిస్తోంది. భూమి ఒకరికి, హక్కు మరొకరికి అన్నట్లు ఉంది. వీటన్నింటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన భూ సర్వేను వడివడిగా చేయాలి. ఈ ప్రక్రియను తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారిపై వేటు తప్పదు’ అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెవెన్యూ, రీ–సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం ఆయన మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
భూ సర్వేలో నిర్లక్ష్యం వద్దు..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను లక్ష్యంగా ఎంపిక చేసి మొదటి విడత భూ సర్వేను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ అంగుళం భూమిని వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ ఆస్తుల వారీగా శాసీ్త్రయంగా సర్వే చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 31 నాన్–కెడస్ట్రల్ గ్రామాలకుగాను 18 గ్రామాల్లో రీ–సర్వే పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 13 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన 13 గ్రామాల్లో, భూపాలపల్లి జిల్లాలో 8, జనగామ జిల్లాలో 5 గ్రామాల్లో సర్వే పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. సర్వే గ్రామాలకు తహసీల్దార్లు ప్రతీరోజు, నెలలో ఐదు రోజులు ఆర్డీఓలు, మూడు సార్లు కలెక్టర్లు పరిశీలించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను ఏమాత్రమూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల నిర్మాణాలు పూర్తిచేయాలి
జూలై 7న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నర్సంపేట, పరకాల, ములుగు, జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో ఐదు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలు, వరంగల్‌లో ఒక డీఐజీ కార్యాలయం మంజూరైనట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా పలివేల్పులలో డీఐజీ కార్యాలయం కోసం ఎకరం 20 గుంటల ఎస్సారెస్పీ స్థలాన్ని కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పరకాలలో నూతన భవన నిర్మాణం 7 శాతం పూర్తయిందని తెలిపారు. భీమదేవరపల్లి, పరకాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హౌసింగ్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం వద్దు
జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లాలో 4,600 ఇళ్లు మంజూరు కాగా 3,946 ఇళ్లకు ప్రాసెస్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు 854 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ములుగు జిల్లాలో కూడా ఇళ్ల పూర్తిశాతం 50 శాతానికిలోపే ఉందని పేర్కొన్నారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ 15నాటికి గరిష్ట సంఖ్యలో పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మీసాల ప్రకాశ్, లాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్, రెవెన్యూ, రిజిస్టేషన్, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హన్మంతు, భూ భారతి డైరెక్టర్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతమ్, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్, సందీప్‌కుమార్ ఝా, భోర్ఖడే హేమంత్ సహదేవరావు, రాహుల్ శర్మ, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు
పర్యవేక్షించాలి
ప్రతీ అంగుళం శాసీ్త్రయంగా ఉండాలి
నిర్లక్ష్యం చేసే అధికారులపై
వేటు తప్పదు
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లా సమీక్షలో
రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హాజరైన మంత్రి సీతక్క, ఎంపీలు,
ఎమ్మెల్యేలు
22–ఏ భూముల విషయంలో జాగ్రత్త..
ప్రతీ జిల్లాలో 22–ఏ కింద ఉన్న భూములు ఏవీ? వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఎన్ని? ఇతర వివరాలు ఏమిటి అనే అంశాలను నాలుగు కాలమ్స్‌తో కూడిన సమగ్ర నివేదికగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేనంబర్ల వారీగా పూర్తి వివరాలను రెండు రోజుల్లో అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు. 22–ఏ జాబితాలో పొరపాటున చేరిన రైతుల భూముల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై, శాసీ్త్రయ పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి సరిహద్దులు నిర్ధారించాలని సూచించారు.


