ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ రాగానే..
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో పలు తప్పిదాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా లబ్ధిదారుల ఇంటి పేర్లు, తండ్రి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామాలు, పిన్‌్‌కోడ్ నంబర్లలో అక్షర దోషాలు, తప్పుల ముద్రణ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక గ్రామం పేరుకు బదులుగా మరో గ్రామం పేరు ముద్రించగా, మరికొన్ని కార్డుల్లో లబ్ధిదారుడి పూర్తి పేరు లేకుండా కేవలం ఇంటిపేరు మాత్రమే నమోదైంది. మరణించిన వారి పేర్లతోనూ స్మార్ట్ రేషన్‌్ కార్డులు రావడం అధికారుల దృష్టికి వచ్చింది.
అన్ని మండలాల్లోనూ..
జిల్లాలో 1,87,756 రేషన్ కార్డులు ఉండగా, ఇందులో 1,87,214 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మండలాలు, గ్రామాల వారీగా కార్డుల పంపిణీ కొనసాగుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి 18,502 కార్డులు మంజూరు కాగా ఇప్పటి వరకు 10,544 కార్డులు పంపిణీ చేశారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ షాపు నంబర్ 16కు వచ్చిన 540 కార్డుల్లో చిరునా మాలో ‘శివునిపల్లి’కి బదులుగా ‘సముద్రాల’గా ముద్రణతో పాటు పిన్‌కోడ్ కూడా తప్పుగా నమోదైంది. ఇంటి యజమానులు మరణించినప్పటికీ వారి పేర్లతో వచ్చిన కార్డులను అధికారులు పంపిణీ చేయకుండా తమ వద్దే ఉంచుకున్నారు. బచ్చన్నపేట మండలంలోని వీఎస్సార్ నగర్, కట్కూరు, లక్ష్మాపూర్, బండనాగారం గ్రామాల్లో 506224 పిన్‌కోడ్‌కు బదులుగా 506221గా తప్పుగా ముద్రించారు. చిల్పూర్ మండలంలో 14,345 కార్డులు ఉండగా ఐదు గ్రామాల్లో పిన్‌కోడ్ తప్పిదాలు నమోదయ్యాయి. కొన్ని కార్డుల్లో లబ్ధిదారుల పేర్లకు బదులుగా కేవలం ఇంటి పేర్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. జఫర్‌గఢ్ మండలానికి 14,766 కార్డులు రాగా, ఒక రేషన్ షాపునకు సంబంధించి సుమారు 25 కార్డులు మరణించిన వారి పేర్లతో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నర్మెట మండలంలో 8,767 కార్డులు రాగా 5,023 పంపిణీ చేశారు. కన్నెబోయినగూడెంలోని 472 కార్డుల్లో గ్రామం పేరుకు బదులుగా వెల్దండగా ముద్రితమైంది. లింగాలఘణపురం మండలానికి 13,803 కార్డులు రాగా ఇప్పటి వరకు 1,207 మాత్రమే పంపిణీ చేశారు. పాలకుర్తి మండలంలోనూ ఇంటి పేర్లు, పిన్‌కోడ్‌లలో తప్పులు వెలుగుచూశాయి. కొడకండ్ల మండలానికి 10,823 కార్డులు రాగా సుమారు 1,300 కార్డులు పంపిణీ చేశారు. జనగామ రూరల్ ప్రాంతంలోనూ పేర్లు, ఇంటిపేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, పిన్ కోడ్‌లలో తప్పులు నమోదయ్యాయి. అధికారుల ప్రకారం, తప్పుగా నమోదైన వివరాలను మీ–సేవ కేంద్రాల ద్వారా ఆన్‌్‌లైన్‌లో సవరించుకునే అవకాశం ఉంది.
ఇంటిపేర్లు..చిరునామాలు..
పిన్‌్‌కోడ్‌లలో పొరపాట్లు
కొందరి పేర్లే లేవు..
మరణించిన వారికీ కార్డులు
కార్డు చేతికొచ్చినా..
వివరాల్లో గందరగోళం
తప్పులను సరిదిద్దేందుకు
గైడ్‌లైన్స్ కోసం ఎదురుచూపులు
ప్రభుత్వం నుంచి స్మార్ట్ రేషన్‌్ కార్డుల సవరణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు. కార్డుల్లో పేర్ల నమోదు, పిన్‌్‌కోడ్, కుటుంబ సభ్యుల వివరాల్లో వచ్చిన తప్పులను ఎలా సరిచేయాలనే అంశంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత స్పష్టత వస్తుంది. అప్పటి వరకు లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– సురేష్‌రెడ్డి, డీసీఎస్‌ఓ, జనగామ


