విద్యార్థులకు ప్రయోజనాలు
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు–మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. దీంతో సర్కారు బడుల్లో ప్రైవేట్, కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమైన నేపథ్యంలో స్కూళ్లలో వసతులు, బోధనా పద్ధతులు, ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అడ్మిషన్లు పెంచే దిశగా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారు. జిల్లాలో 508 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 103, కేజీబీవీలు 12, మోడల్ 8, యూఆర్‌ఎస్ 1, ఎయిడెడ్ 10, రెసిడెన్షియల్ 19 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య పెంపునకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలు కల్పిస్తున్న సౌకర్యాలు వివరిస్తున్నారు.
డిజిటల్ తరగతులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ పార్టీ ప్యానెల్ ద్వారా 8,9,10 తరగతుల వారికి డిజిటల్ తరగతులు నిర్వహిస్తారు. సౌకర్యవంతమైన డెస్క్ బెంచీలు, డిజిటల్, సైన్స్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. 103 హైస్కూల్స్ ఉండగా వీటిల్లో 6,443మంది విద్యార్థులు గతేడాది టెన్త్ పరీక్షలు రాయగా 6,298 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 97.66గా ఉంది. 60పైగా స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెంచడానికి విద్యాశాఖ అధికా రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు–ప్రత్యేకతలు
● ఉచిత విద్యాబోధన, పాఠ్య, నోట్ పుస్తకాలు
● ఏడాదికి రెండు జతల యూనిఫామ్‌ల పంపిణీ
● మధ్యాహ్న భోజనం, వారానికి మూడు రోజులు గుడ్లు
● రక్తహీనత రాకుండా వారానికి మూడురోజులు రాగిజావ, బెల్లంతో అనుబంధ ఆహారం
● రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం కింద ఆరోగ్య పరీక్షలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్, డీవార్మింగ్ మాత్రల పంపిణీ
● పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, 60రోజుల పాటు స్నాక్స్
● ఉన్నత విద్యార్హతలు, అనుభవం, సుశిక్షితులైన అధ్యాపకులతో విద్యాబోధన
● ఆత్మరక్షణకు కరాటేతోపాటు వివిధ క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ
పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
బాసర ట్రిపుల్ ఐటీలో చదివేందుకు ప్రభుత్వ పాఠశాలలో (నాన్ రెసిడెన్షియల్ రూరల్ స్కూల్) చదివిన వారికి 24 మార్కుల వెయిటేజీ ఇస్తారు.
ఈసారి జిల్లాకు చెందిన 21 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు.
8వ తరగతి విద్యార్థులకు జాతీయస్థాయిలో ఎన్‌ఎమ్‌ఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష రాసే అవకాశం ఉండగా ఎంపికై న వారికి ఏడాదికి రూ.12వేల చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం లభిస్తుంది.
3కి.మీపైగా దూరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలకు రూ.600 రవాణా భత్యం, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ లభించనుంది.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ బడిలో బోధన
డిజిటల్ తరగతులు..
అత్యాధునిక వసతులు
ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న
ప్రభుత్వ పాఠశాలలు
వసతుల కల్పన, విద్యార్థుల సంఖ్య
పెంచే దిశగా ఉపాధ్యాయులు


