ప్లాస్టిక్‌ రహిత పట్టణాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రహిత పట్టణాన్ని నిర్మిద్దాం

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

జనగామ: జనగామ పట్టణాన్ని పూర్తిగా ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యక్ష రంగంలోకి దిగారు. ప్లాస్టిక్‌ వినియోగం వందశాతం నిర్మూలనకు నిరంతర నిఘా ఉంటుందని ప్రకటించారు. పట్టణ సుందరీకరణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ భూతాన్ని జనగామ నుంచి పూర్తిగా తరిమేయడం ప్రతీ పౌరుడి బాధ్యతని తెలిపారు.

వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి

ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా నిర్మించేందుకు అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు సహకరించాలని కోరారు. హోటళ్లు, కిరాణషాపులు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌తో పాటు అన్ని దుకాణదారులు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించారు. ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో నూలు సంచులు, జనపనార బ్యాగులు, కాగితపు కవర్లు వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రూ.25వేల వరకు జరిమానా

ప్లాస్టిక్‌ హోల్‌సేల్‌ షాపుల యజమానులను ఉద్దేశించి కమిషనర్‌ కీలక హెచ్చరిక జారీ చేశారు. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను విక్రయిస్తే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా సంబంధిత షాపుల లైసెన్స్‌లను రద్దు చేసి, 2019 తెలంగాణ మున్సిపల్‌ చట్టం ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తనిఖీలు ముమ్మరం

నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు ము న్సిపల్‌ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేశామని కమిషనర్‌ వెల్లడించారు. ఈ బృందాలు రోజూ మార్కెట్‌, వ్యాపార సముదా యాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ప్లాస్టిక్‌ రహిత పట్టణం కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్‌ వాడకంతో కాల్వలు పూడుకుపోవడం, పశువులు చనిపోవడం, భూసారం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ప్రజలు, వ్యాపార వర్గాలకు మున్సిపల్‌ అధికారుల విజ్ఞప్తి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన

చర్యలు తప్పవు

కమిషనర్‌ హెచ్చరిక

పట్టణంలో ముమ్మరంగా తనిఖీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement