జిల్లాలో రెండు కేంద్రాలు.. 588 మంది అభ్యర్థులు
జనగామ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ రీ– ఎగ్జామ్‌కు జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు.
జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రహదారి కోర్టు ఏరియాలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏబీవీ డిగ్రీ కళాశాలలో 396 మంది, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో 192 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రెండు కేంద్రాల్లో కలిపి మొత్తం 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
పరీక్ష కేంద్రంలోని ప్రతిగదికి ఇద్దరు ఇన్విజిలేటర్ల చొప్పున మొత్తం 50 మంది సిబ్బందిని నియమించారు. జిల్లా కలెక్టర్, కోఆర్డినేటర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో జిల్లా కమిటీ సభ్యులు, అదనపు కలెక్టర్, డీసీపీ, సిటీ కో ఆర్డినేటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరీక్ష జరగనుంది. ఏబీవీ కళాశాల కేంద్రానికి రవీంద్రనాథ్, మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకుల సెంటర్‌కు అనిత సూపరింటెండెంట్లుగా వ్యవహరించనున్నారు.
సీసీ కెమెరాలలో నిఘా..
పరీక్షలు పూర్తిగా సీసీటీవీ నిఘాలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఒక పోస్టుకార్డు సైజు ఫొటోతోపాటు ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర గుర్తింపు కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.
అదనంగా 15 నిమిషాలు
పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరగ నుంది. గతంతో పోలిస్తే పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచారు. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం నిబంధన అమలులో ఉంది. సాధారణ దుస్తులతో మాత్రమే రావాలని, షూ, బెల్ట్‌లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పెన్నులను పరీక్షా కేంద్రంలోనే అందజేస్తారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఐరిస్ స్కానింగ్ నిర్వహించిన తర్వాతనే పరీక్షా గదుల్లోకి అనుమతించనున్నారు. చెవి, ముక్కు, చేతి వేళ్లకు ధరించే ఆభరణాలు, రింగులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కూలింగ్ గ్లాసులు నిషేధించారు. వర్షాకాలం కావడంతో హాల్ టికెట్‌ను పారదర్శక ప్లాస్టిక్ కవర్‌లో తీసుకురావాలని సూచించారు. వాటర్ బాటిళ్లపై స్టిక్కర్లు ఉండకూడదని పేర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం
పరీక్ష నిర్వహణలో పారదర్శకత కోసం ఇన్విజిలేటర్లను సబ్జెక్టులకు సంబంధం లేని విభాగాల నుంచి ఎంపిక చేశారు. మే 3న నిర్వహించిన పరీక్షకు 566 మంది హాజరుకాగా, రీ–ఎగ్జామ్ అవకాశం కల్పించడంతో జిల్లాలో 22 మంది అదనంగా పరీక్ష రాయనున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పరీక్ష రోజు విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు. నీట్ పరీక్ష నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి, ఇన్విజిలేటర్లు, సిబ్బందికి నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో వెస్ట్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో సెంటర్ల వద్ద 144 సెక్షన్‌తోపాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష సమంలో జిల్లా కేంద్రంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేస్తారు.
పరీక్ష సమయం 15 నిమిషాల పెంపు
నిమిషం నిబంధన వర్తింపు
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
ఐరిష్ స్కానింగ్ అనంతరం
లోనికి అనుమతి
సంప్రదాయం మినహా..
ఆభరణాలకు అనుమతి లేదు


