ఇంగ్లిష్‌ టీచర్‌ మాకొద్దు | - | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ టీచర్‌ మాకొద్దు

Jun 16 2026 1:10 AM | Updated on Jun 16 2026 1:10 AM

ఉపాధ్యాయురాలి వ్యవహారశైలిపై

గ్రామస్తుల నిరసన

నష్కల్‌ పాఠశాలలో పునఃప్రారంభం

రోజే గొడవ

చిల్పూరు: మండలంలోని నష్కల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభం రోజే ఇంగ్లిష్‌ టీచర్‌ తమకు వద్దంటూ పాఠశాల ఆవరణలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈనెల 11వ తేదీన బడిబాట కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎం శ్రీదేవి ఆదేశాలతో ఉపాధ్యాయులు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈక్రమంలో ఇదే పాఠశాలలో 8వ తరగతి చదివే ఓ విద్యార్థిని ఇంగ్లిష్‌ టీచర్‌ జ్యోతిలక్ష్మికి కనిపించింది. దీంతో విద్యార్ధినిని పక్కకు తీసుకెళ్లి ‘నీకు అమ్మనాన్నలు లేరని, ఎవరికీ పుట్టావో తెలియదు’ అని వింత ప్రశ్నలు వేసి వెళ్లి పోయింది. దీంతో ఆ బాలిక మనస్తాపంతో నిద్రహారాలు మాని తన తల్లిదండ్రులు ఎవరో చెప్పాలంటూ తనను సాకుతున్న వారితో గొడవ చేసింది. దీంతో వారు ‘నీకు ఎవరో తప్పు చెప్పారు.. మేమే నీ తల్లిదండ్రులం’ అని చెప్పినా వినలేదు. ఈ విషయాన్ని సర్పంచ్‌ శాతబోయిన రాజు, ఉప సర్పంచ్‌ అరూరి మాధవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారు బాలిక వద్దకు వచ్చి ‘నీకు ఎవరు అలా చెప్పారు..’ అని అడగడంతో ఇంగ్లిష్‌ టీచర్‌ పేరు చెప్పింది. సోమవారం ఉదయం పాఠశాల సమయంలో బాలికతోపాటు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, గ్రామస్తులు పాఠశాలకు వెళ్లే ముందు ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌, ఎంఈఓ దాసరి గోవర్ధన్‌కు సమాచారం ఇచ్చి వెళ్లారు. హెచ్‌ఎం శ్రీదేవితో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ‘నా మీద ఆరోపణలు చేయడానికి వచ్చారా?..’అంటూ ఆవేశంతో టేబుల్‌పై ఉన్న పుస్తకాలను గ్రామస్తుల మీదకు విసురుతూ దుర్భాషలాడింది. దీంతో గ్రామస్తుల పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ఆదేశాలతో ఎంఈఓ పాఠశాలకు వెళ్లి విచారణ చేస్తున్న సమయంలోనూ టీచర్‌ అలాగే ప్రవర్తించడంతో ఆమె భర్త ఆమెకు ఆరోగ్యం బాగాలేదని సమాధానం చెపుతూ వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎంఈఓ మాట్లాడుతూ.. ఆమె పాఠశాలలో ప్రవర్తించిన తీరు బాగాలేదంటూ కలెక్టర్‌కు వివరించారు. పూర్తి ఆదేశాలు వచ్చే వరకు ఆ టీచర్‌కు సెలవు ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement