తీరనున్న ‘సాగు’బాధలు | - | Sakshi
Sakshi News home page

తీరనున్న ‘సాగు’బాధలు

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలో పాంనూర్‌ గ్రామంలోని బంజరుకాల్వ పనులు దాదాపు మూడు దశాబ్దాలుగా మరమ్మతుకు నోచుకోకపోవడంతో సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు, పాలకులు మారినా పాంనూర్‌ బంజరుమాటు తీరని సమస్యగా మిగలడంతో రైతులు అరిగోస పడుతున్నారు. అయితే ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బంజరుకాల్వ అభివృద్ధి కోసం రూ. కోటి 92లక్షల 70వేలు నిధులు మంజూరు చేయించారు.

ఎట్టకేలకు కష్టాలకు చెక్‌..

బంజరుకాల్వకు ఎమ్మెల్యే చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఎట్టకేలకు పాంనూర్‌తో పాటు చిల్పూరు, జఫర్‌గఢ్‌ మండలాల రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ పూర్తయి అక్కడి నుంచి దాదాపు 17ఏళ్లుగా సాగునీరు వస్తున్నా బంజరుకాల్వ శిథిలమై పూడుకపోవడంతో రైతులకు సాగునీరు రావడం లేదు. బంజరుకాల్వను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొస్తే మొత్తంగా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో 550ఎకరాలు పాంనూర్‌, 250 ఎకరాలు చిల్పూరు మండలం నష్కల్‌, 250 ఎకరాలు జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్లు గ్రామాలకు సాగునీరు అందుతుంది. రెండునెలల క్రితం గ్రామంలో జరిగిన ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరుకాగా పలువురు బంజరుకాల్వ సమస్యపై సభ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో బంజరుకాల్వను 31కిలోమీటర్ల పొడవుతో సీసీ ఉపయోగించి నిర్మాణం చేయనున్నారు. అదేవిధంగా కాల్వ ద్వారా వచ్చే సాగునీటిని రైతులు వినియోగించుకునేలా కాల్వపైన గేటువాల్వులతో కూడిన 8 తూములను ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి పనులు పూర్తయితే దాదాపు వెయ్యి ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందనుంది.

రెండు పంటలకు నీళ్లు

బంజరుమాటు పనులతో దాదాపు వెయ్యి ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కడియంకు గ్రామస్థులు, రైతులందరం రుణపడి ఉంటాం.

–పోలెపల్లి సంపత్‌రెడ్డి, సర్పంచ్‌, పాంనూర్‌

త్వరలో పనులు ప్రారంభిస్తాం..

బంజరుకాల్వ సమస్యపై రైతులు, గ్రామస్థులు గతంలో నా దృష్టికి తీసుకొచ్చారు. సమస్యపై పూర్తి అవగాహనతో గ్రామస్థులు, రైతుల కోరిక మేరకు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించా. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.

–ఎమ్మెల్యే కడియం శ్రీహరి

బంజరుకాల్వ మరమ్మతులకు

రూ.1.92 కోట్లు నిధుల మంజూరు

వెయ్యి ఎకరాలకు సాగునీరు

మూడు మండలాల రైతులకు

ప్రయోజనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement