వేసవి సెలవులు మరో మూడురోజులు | - | Sakshi
Sakshi News home page

వేసవి సెలవులు మరో మూడురోజులు

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

15న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల

పునఃప్రారంభం

పాఠశాల రీఓపెనింగ్‌పై విద్యాశాఖ

ఉత్తర్వులు జారీ

జనగామ: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పునఃప్రారంభ తేదీని రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటగా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని 15న ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

రెండో శని, ఆదివారం కారణంగా నిర్ణయం

ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం రావడంతో పాఠశాలలను 12న ప్రారంభించడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పలు వర్గాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో వేసవి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. పునః ప్రారంభం వాయిదా కారణంగా ఏర్పడే విద్యా సమయ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అకడమిక్‌ క్యాలెండర్‌లో నిర్దేశించిన బోధనా దినాలను పూర్తి చేసేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని సాధారణ పనిదినంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ రోజు పాఠశాలలన్నీ సాధారణ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.

పాఠశాలల పునఃప్రారంభానికి సన్నద్ధం

పాఠశాలల పునఃప్రారంభానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్యార్థులకు వేసవి సెలవులు మరో మూడు రోజులు పొడిగించినప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటి నుంచే బాధ్యతలు ప్రారంభం కానున్నాయి. పాఠశాల భవనాలకు రంగులు వేయడం, ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించడం, పరిశుభ్రత చర్యలు చేపట్టడం, డిజిటల్‌ తరగతి గదులు, కంప్యూటర్లను తనిఖీ చేసి సిద్ధంగా ఉంచడం వంటి పనులు చేపట్టనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement