రవాణా కష్టాలు | - | Sakshi
Sakshi News home page

రవాణా కష్టాలు

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

ప్యాడీ క్లీనర్లు లేక.. బస్తాకు 2 కిలోల వరకు కోతలు లారీల కోసం పడిగాపులు

ధాన్యం తూర్పారకు ప్రైవేట్‌ ప్యాడీ క్లీనర్లను ఆశ్రయిస్తున్న రైతులు

తాలు తంటాలు..

పాడైపోయిన ప్యాడీ క్లీనర్‌

ఎర్రగొల్లపహడ్‌లో కుప్పలుగా ఉన్న ధాన్యం రాశులు

జనగామ రూరల్‌: జిల్లాలో ధాన్యం దిగుమతుల వ్యవహారం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక వైపు పండించిన ధాన్యాన్ని కల్లాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు నానా కష్టాలు పడుతుంటే.. మరోవైపు తాలు తొలగించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీక్లినర్స్‌ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో పంట పెట్టుబడితో పాటు విక్రయించేందుకు అదనపు భారం పడుతోంది. కాంటా కోసం హమాలీలకు క్వింటాల్‌కు రూ.40లు చెల్లిస్తుండగా అదనంగా ధాన్యం తాలు తొలగించడానికి ఒక్కొక్క రైతు సుమారుగా 2 వేల నుంచి 6 వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. అలాగే యాసంగి ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతుండడంతో లారీలు రోజుల తరబడి మిల్లుల ముందే నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లాల వద్ద తూకం వేసి పంపించినా, మిల్లర్లు దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క కేంద్రంలో ఒక్కోరకంగా తూకం వేస్తున్నారు. ఎర్రగొల్లపహడ్‌ గ్రామంలో 41 కిలోల 500 గ్రాములు వేస్తుండగా వడ్లకొండలో 41 కిలోల 200 గ్రాములు వేస్తుండడం గమనార్హం.

జిల్లా వ్యాప్తంగా 231 సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను 50 రోజుల క్రితం ప్రారంభించారు. ప్రతీ సెంటర్‌కు ధాన్యంలో తాలు తొలగించేందుకు తూర్పార పట్టే యంత్రం అందజేశారు. అయితే జిల్లాలో 231 కేంద్రాలు ఉండగా 243 యంత్రాలు ఉన్నాయి. ఇందులో 123 పెద్దవి ఉండగా 121 పాత యంత్రాలు ఉన్నాయి. ఇందులో 224 పని చేస్తున్నాయి. మిగతా యంత్రాలు రిపేర్‌లో ఉన్నాయి. అయా కేంద్రాల్లో ధాన్యం తాలు తొలగించడానికి ప్రైవేట్‌ యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. గంటకు రూ.1000 నుంచి 1500 వెచ్చిస్తున్నారు. దీంతో వేల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. సెంటర్‌కు రెండు చొప్పున యంత్రాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు..

తూకం సమయంలోనే అధికారులు, సిబ్బంది బస్తాకు 2 కిలోలపైనే తరుగు పేరుతో అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భారీగా తరుగు తీసిన తర్వాత కూడా మిల్లుల వద్ద మళ్లీ తాలు పేరుతో ధాన్యాన్ని తిరస్కరించడం లేదా అదనపు కోతలు పెట్టాలని చూడడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోలు తీసుకోవాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా 42 కిలోలు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. దానికి సిద్ధంగా లేని రైతుల ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే లారీ డ్రైవర్లు సైతం రైతుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండడంతో 17 శాతం రావల్సిన తేమ శాతం 10 నుంచి 5 శాతం వరకు వస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది.

మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నిర్వాహకులు కాంటా వేయడం లేదు. అక్కడి నుంచి లారీలు వస్తేనే కాంటా వేసిన ధాన్యం మిల్లులకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో కల్లాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. జనగా మ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగొల్లపహడ్‌లో నాలుగు రోజుల నుంచి లారీలు రాకపోవడంతో హమాలీలు కూడా ఖాళీగా ఉంటున్నామని తెలిపారు.

ఒక్కొక్క రైతు రూ.2వేల నుంచి 5 వేల వరకు చెల్లింపులు

కొనుగోలు కేంద్రాల్లో మందకొడిగా కాంటాలు

రవాణా లేక రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులు

కొనుగోళ్లలో ఆలస్యం.. అన్నదాతలకు అదనపు భారం

Advertisement
 
Advertisement
Advertisement