చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలి

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలి శాంతియుత వాతావరణంలో బక్రీద్‌ నిర్వహించుకోవాలి డెంగీపై అప్రమత్తత అవసరం

జనగామ: నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలు అందించే విధంగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన దేవాదుల ప్రాజెక్టు పురోగతి సమీక్షా సమావేశంలో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్‌ అంశాలు, రైతులకు నీటి సరఫరా పరిస్థితులపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి సమగ్ర సమాచారంతో వినతి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో సాగునీటి అవసరాలు, భూసేకరణ సమస్యలు, కాలువల నిర్మాణంలో జాప్యం, చివరి ఆయకట్టుకు సాగునీటి సరఫరా అందించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు ఫేజ్‌–3 పరిధిలోని ప్యాకేజీ–8 కింద ఉన్న తపాస్‌పల్లి, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల పరిధిలో కాలువల నిర్మాణ పనులు చాలా కాలంగా నిలిచిపోయాయని ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. పనులను తక్షణమే పునఃప్రారంభించి నిర్దిష్ట గడువులో పూర్తి చేయా లని అధికారులను కోరారు. బొమ్మకూరు కుడి కాలువ ద్వారా సాగునీరు సక్రమంగా అందడం లేదని, కాలువలో సాంకేతిక లోపాలు, నిర్వహణ సమస్యల కారణంగా రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు.

జనగామ రూరల్‌: శాంతియుత వాతావరణంలో బక్రీద్‌ పండుగను నిర్వహించుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ అన్నారు. శనివారం ముస్లిం నాయకుల సభ్యులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగను శాంతియుతంగా జరుపుకొని సామరస్యాన్ని కాపాడుకోవాలన్నారు. జంతువుల బలి కార్యక్రమాలు సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం మాత్రమే నిర్వహించాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. జంతువుల అక్రమ రవాణా అనుమతించబోమని తెలిపారు.

రఘునాథపల్లి: డెంగీపై అప్రమత్తత అవసరమని, ప్రజలు తప్పనిసరి ఇంటి పరిసరాల శుభ్రత పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌రావు సూచించారు. జాతీ య డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆధ్వర్యంలో డెంగీపై ఏర్పాటు అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌ఓ జెండా ఊపి ప్రారంభించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎల్‌.అశోక్‌కుమార్‌, ప్రొగ్రాం ఆఫీసర్‌ కమల్‌హాసన్‌, స్థానిక వైద్యాధికారి స్రవంతి, సూపర్‌వైజర్లు, అశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

జనగామ రూరల్‌: జిల్లా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌ కార్యాలయంలో 24/7టోల్‌ ఫ్రీ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సహాయ కేంద్రం ద్వారా వరి సేకరణ, తాగునీటి సరఫరా, గ్యాస్‌ సరఫరా, ఇంధన సరఫరా.. తదితర అంశాలకు సంబంధించిన ఫి ర్యాదులు స్వీకరించి, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ సిబ్బంది ప్రతీ గ్రామంలో ప్రజలకు ఈ సమాచారం చేరేలా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. టోల్‌ ఫ్రీ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1800–425–6605 కాల్‌ చేయాలని సూచించారు.

54 మంది గైర్హాజరు

జనగామ రూరల్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్‌న్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు శనివారం 54 మంది గైర్హాజరైనట్లు ఇంటర్‌ విద్యాధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు. ఫస్టియర్‌ జనరల్‌ విద్యార్థులు 1,154 గాను 1,134 హాజరు కాగా, 20 గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 183మందికి గాను 162 విద్యార్థులు హాజరు కాగా 21 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన సెకండియర్‌ పరీక్షలకు జనరల్‌లో 330మందికి గాను 326 హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ 132మందికి 123మంది హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement