సిబ్బంది భద్రత మా తొలి ప్రాధాన్యం. పనిలోకి దిగేముందు ఒక్క నిమిషం సమయం కేటాయించి భద్రతా ప్రమాణాలను పరిశీలించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. వన్ మినిట్ రూల్‌ను ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి. ఈ చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాలను నివారించగలదు.
– సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ,
ఎన్పీడీసీఎల్, జనగామ
జనగామ: జనగామ సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటూ టీజీఎన్పీడీసీఎల్ ‘వన్ మిని ట్ రూల్’ పేరుతో ప్రత్యేక భద్రతా విధానాన్ని ప్రా రంభించింది. ఫీల్డ్‌లో విద్యుత్ పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి కేవలం ఒక నిమిషం సమయం తీసుకొని భద్రతా ప్రమాణాలను స్వయంగా పరిశీలించుకోవడం ఈ విధానంలోని ముఖ్య అంశం.
ప్రమాదాల నివారణకు కొత్తదారి
విద్యుత్ ప్రమాదాలను తగ్గించి సిబ్బంది ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఈ కొత్త ఆలోచనను ప్రవేశపెట్టగా, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నందున, పని ముందు ఒక నిమిషం జాగ్రత్త తీసుకోవడం ప్రాణాలను కాపాడే కీలక అలవాటుగా అధికారులు చెబుతున్నారు. ‘వన్ మినిట్ రూల్’ లో భాగంగా ఉద్యోగులు పరిశీలించాల్సిన అంశాల్లో లైన్ క్లియర్ (ఎల్‌సీ) పొందడం, ఇండక్షన్ టెస్టర్‌తో పవర్ లేకపోవడం నిర్ధారించడం, పీపీఈ ధారణ, ఎర్తింగ్ అమలు, డబుల్ ఫీడింగ్ ప్రమాదాన్ని నివారించడం, పరికరాల స్థితి పరిశీలన వంటి అంశాలు ఉన్నాయి. సురక్షిత విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉద్యోగులు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘ఒక్క నిమిషం ఆలోచన, జీవితాంతం భద్రత’ అనే సందేశంతో టీజీఎన్పీడీసీఎల్ ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది.
విద్యుత్ శాఖలో ‘వన్ మినిట్ రూల్’ అమలు
ప్రమాదాల నివారణకు కొత్తదారి


