● కొత్త ఎల్టీ సర్వీస్‌ల కోసం
సరళమైన చార్జీలు
జనగామ: వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వేగంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కొత్తగా ఎల్‌టీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులు ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు చెల్లించి త్వరగా సర్వీసులు పొందవచ్చు. ఈ మేరకు రెగ్యులేషన్ నంబర్ 1 ఆఫ్ 2026 ప్రకారం కొత్త సర్వీసుల కొరకు ఎన్పీడీసీఎల్ సంస్థ సర్వీస్ లైన్ చార్జీల (ఎస్‌ఎల్‌ఎస్) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో..
వినియోగదారులు ముందుగానే తమకు ఎంత సర్వీస్ లైన్ చార్జీలు వస్తాయో తెలుసుకుని సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అనవసర ఆలస్యాలు, అదనపు భారం పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్ పొందడం మరింత సులభం కానుంది.
చార్జీలు ఇలా..
20 కిలోవాట్ వరకు డెవలప్‌మెంట్, సర్వీసు చార్జీలు వర్తింపు. 20 కిలోవాట్ పైగా కేవలం ఎస్‌ఎల్‌ఎస్ మాత్రమే తీసుకుంటారు. డెవలప్‌మెంట్ చార్జీలు రద్దు చేశారు. కేటగిరీ వారీగా చార్జీల విషయానికి వస్తే గృహ వినియోగదారులు (ఎల్‌టీ–1) పరిధిలో 1 కిలోవాట్ వరకు రూ.500, 1 నుంచి 5 కిలో వాట్‌కు రూ.500, ప్రతీ కిలోవాట్‌కు రూ.600, 5 నుంచి 20 కిలోవాట్ రూ.2,900, ప్రతి కిలోవాట్‌కు రూ.1500, 20 కిలోవాట్ పైగా ప్రతీ కిలోవాట్‌కు రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ పరిధిలో 1 కిలోవాట్ వరకు రూ.1,000, 1 నుంచి 5 కిలోవాట్ వరకు రూ.1,000, ప్రతీ కిలోవాట్‌కు రూ.1,200, 20 కిలోవాట్ పైగా ప్రతీ కిలోవాట్‌కు రూ.10వేలు చెల్లించాలి. మిగతా కేటగిరీల్లో కూడా లోడ్‌కు అనుగుణంగా చార్జీలను సవరించారు. అపార్ట్‌మెంట్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీ, స్టోరీ భవనాలకు మొత్తం కాంట్రాక్ట్ లోడ్‌పై ఆధారపడి ఎస్‌ఎల్‌ఎస్ అమలు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చు వినియోగదారుడిపై భారం పడకుండా నిబంధనలు అమలులోకి తెచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు బాధ్యత పూర్తిగా విద్యుత్ సంస్థదే ఉంటుంది.
రైతులకు లాభం
వ్యవసాయ వినియోగదారులకు సులభమైన రేట్లు అమల్లోకి తీసుకువచ్చాం. వ్యవసాయ కనెక్షన్‌కు కేవలం 1 కిలోవాట్‌కు రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త విధానం ద్వారా సేవల మంజూరులో వేగం పెరిగి, అవినీతి అవకాశాలు పూర్తిగా తగ్గి, చార్జీలపై స్పష్టత పెరుగుతుంది. విద్యుత్ కనెక్షన్ పొందడాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వం లక్ష్యం.
– సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎన్‌పీడీసీఎల్


