రఘునాథపల్లి: ఆరోగ్యకరమైన పంటల కోసం రైతులు సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించాలని జిల్లా వ్యవసాయాధికారి కట్ట అంబికాసోని అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో మంగళవారం సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు లేని ఆహారాన్ని పండించడం ఎంతో అవసరమన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలతో పాటు, నేల సారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు మాట్లాడుతూ సహజ వ్యవసాయం ద్వారా నేల సారాన్ని పెంచడంతో పాటు దీర్ఘకాలికంగా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందన్నారు. అనంతరం సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎస్.కరుణాకర్, ఏఈఓలు శివుడు, అజయ్ కల్పన, సౌజన్య, కీర్తి స్నేహ, కృషి, సఖి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


