నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
జనగామ: పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లను జనగామ, స్టేషన్‌ఘన్ పూర్ పురపాలికల పరిధిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. జనగామ మున్సిపాలిటీలో మూడు వార్డులకు ఒక్కో నామినేషన్ కౌంటర్ చొప్పున మొత్తంగా 10 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 18 వార్డులు ఉండగా ఆరు కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినేషన్‌తో తప్పక సమర్పించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. నామినేషన్ల స్వీకరణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో ఒక టీమ్ వర్క్‌గా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పారు. పలు సూచనలు, సలహాలతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అదనపు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ట, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్‌తో అబ్జర్వర్ల సమీక్ష
ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎ.నర్సింహరెడ్డి(ఐఏఎస్) వ్యయ పరిశీలకులు ఎస్.జయశ్రీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అనుభవం కలిగిన 16 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ తదితర అంశాలపై చర్చించారు. సాధారణ అబ్జర్వర్ నర్సింహారెడ్డికి నోడల్ ఆఫీసర్‌గా హౌజింగ్ పీడీ మాత్రునాయక్, వ్యయ పరిశీలకులు జయశ్రీకి నోడల్ ఆపీసర్‌గా డీసీఓ కోదండరామ్‌లను నియమించారు.


