‘పీఎంశ్రీ’ నిధులు దుర్వినియోగం చేయొద్దు
● సీట్ జాయింట్ డైరెక్టర్
విజయలక్ష్మి
జనగామ రూరల్: పీఎంశ్రీ పాఠశాలల నిధులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీట్(స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ) జాయింట్ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ జిల్లా స్థాయి సమావేశంతో పాటు పీఎంశ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ శ్రీఅర్జున్, రాష్ట్ర క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనాథ్, రాష్ట్ర పీఎం పోషణ్ కోఆర్డినేటర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపార్, ఎంబీయూ ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, భౌతిక వసతులు, విద్యుత్ సౌకర్యం, నిర్మాణాలు వంటి వివిధ అంశాల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా గత నెలతో పోలిస్తే జిల్లా పురోగతి సాధించిందని మరింత ముందుకుసాగాలని అన్నారు. వచ్చే రెండు నెలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే, పదో తరగతి పరీక్షలు ఉన్నాయని, అన్ని పనులు ఈనెలలోనే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ సత్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.


