టీచర్ల శిక్షణ నిధుల ఖర్చుపై ఇంటెలిజెన్స్ ఆరా
జనగామ: జిల్లాలో గత వేసవిలో ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణకు సంబంధించి నిధుల ఖర్చుపై స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. శిక్షణ నిధుల ఖర్చులో అవకతవతకలు జరిగాయని టీచర్ల సంఘాల బాధ్యుల అభిప్రాయాలతో సాక్షి దినపత్రికలో వచ్చిన వరుస కథనాలతో ఇంటెలిజెన్స్ టీమ్ వివరాలను సేకరిస్తు న్నట్లు విశ్వసనీయ సమాచారం. శిక్షణ సమయంలో టీచర్లకు అందించిన భోజనం, స్నాక్స్ క్వాలిటీ, వాటికి చేసిన ఖర్చు నిబంధనల మేరకు ఉందా లేదా అనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే టీచర్లకు ఇవ్వాల్సిన డబ్బులను ఎలా చెల్లించారు.. ఎంత ఇచ్చా రు.. అనే విషయాలను ఆయా టీచర్ల సంఘాల బాధ్యులకు సైతం ఫోన్ చేసి సమాచారం కోరినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గతేడాది మొత్తంగా జరిగిన శిక్షణలు ఎన్ని, ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్ ఎంత అనే దానిపై స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలను సేకరిస్తున్నారనే సమాచారం ఉపాధ్యాయ సంఘాలు, వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
సీఎం కప్ క్రీడాపోటీలకు
దరఖాస్తు చేసుకోవాలి
జనగామ రూరల్: సీఎం కప్–2025 (2వ ఎడిషన్) కు సంబంధించి గ్రామస్థాయి ఎంపికల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి కోదండరాములు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 9182552593 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.


