ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
● లిఖితపూర్వకంగా 15 అభ్యంతరాలు
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో చేపట్టనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ సోమవారం సాయంత్రంతో ముగిసింది. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు సోమవారం చివరితేదీ కావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పలువురు ఓటర్ల జాబితాలో తమ పేర్లు, వార్డులు చూసుకోవడానికి, అభ్యంతరాలపై దరఖాస్తులు చేసేందుకు రావడంతో సందడిగా కనిపించింది. ప్రధానంగా తమ ఓట్లు ఇతర వార్డులలో చేర్చారని, ఒకే కుటుంబంలోని వారి ఓట్లు రెండు వార్డుల్లో ఉండటం, ఓటర్ల జాబితాలో తండ్రి పేరు తప్పుగా పడటం లాంటి సమస్యలు కనిపించాయి. మున్సిపాలిటీ ఏర్పాటు సమయంలో ముందుగా ప్రకటించిన విధంగా వార్డుల వారీగా ఓట్లు ఉండాలని, పలువురి ఓట్లు వార్డులు మారాయని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. కాగా ముసాయిదా ఓటర్ల జాబితాపై శనివారం సాయంత్రం వరకు 8 దరఖాస్తులు రాగా సోమవారం 7 దరఖాస్తులు వచ్చాయని కమిషనర్ బి.రాధాకృష్ణ తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు గడువు ముగిసిందని, ఓటర్ల తుదిజాబితా ఈనెల 10న ప్రకటిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.


