
పారదర్శకంగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్‌లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వీసీలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల పరిధిలో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితా ఎంపిక చేయాలని, ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన ప్రతీ 200 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, ఏప్రిల్ 30 లోపు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసేలా చూడాలన్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులను నిర్వహించాలన్నారు. వీసీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, డీఆర్డీవో పీడీ వసంత, హోసింగ్ పీడీ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకర్లు సహకరించాలి
రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాలులో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి రాజీవ్ యువ వికాసం పథకం, వాల్టాచట్టం అమలుపై బ్యాంకర్లు, సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాను తయారు చేయాలన్నారు. ఈ సమీక్షలో డీఆర్డీవో పీడీ వసంత, డీపీఓ స్వరూప, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీధర్, అధికారులు ఉన్నారు.
వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి