ఏ ఉద్యోగమైనా ఉదయం పూట మాత్రమే విధులు నిర్వహిస్తుంటారు. కానీ, నర్సులు మాత్రం రాత్రి, పగలు తేడా లేకుండా సేవా భావంతో పనిచేస్తారు. కోవిడ్ సమయంలో మొక్కవోని ధైర్యంతో వారు సేవలు అందించిన రోజులను చూశాం. అన్నీ మూతపడ్డా ఆసుపత్రులు మాత్రం ఎళ్లవేళలా తెరిచే ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వచ్చినా వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు సేవలందిస్తూనే ఉంటారు. రోగమేదైనా నర్సులు మాత్రం రోగులను అక్కున చేర్చుకొని వైద్యాన్ని అందిస్తారు. సడలని సంకల్పంతో విధులు నిర్వహిస్తారు.
వైద్యుల తర్వాత నర్సులదే కీలకపాత్ర
వైద్య సేవల్లో వైద్యుల తర్వాత అత్యంత కీలకమైన పాత్ర పోషించేది నర్సులే. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వు, ఆత్మీయ స్పర్శతో రోగులకు సేవలందిస్తుంటారు. డాక్టర్ రౌండ్స్‌లో భాగంగా వార్డుకు వచ్చి రోగిని పరీక్షించి ఏయే మందులు వాడాలో కేస్‌షీట్‌పై రాసి వెళ్లిపోతారు. డాక్టర్ పేర్కొన్నట్లు రోగికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు ఇండెంట్ రాసుకొని మెడికల్ స్టోర్స్ నుంచి తెప్పించి వాడుతారు. ఏమైనా వైద్య పరీక్షలు అవసరమైతే నాల్గో తరగతి ఉద్యోగుల సాయంతో చేయిస్తారు. 24 గటలు అందుబాటులో ఉంటూ పేషెంట్‌కు వ్యాధి తగ్గే వరకు సేవలందిస్తారు.
సేవలకు సలాం
ప్రమాదాల్లో గాయపడినవారు, మందు తాగి ఆస్పత్రి పాలైనవారు, ఆపరేషన్లు చేయించుకున్నవారు, డెంగీ, మలేరియా వంటి జబ్బున పడినవారు మాత్రమే కాకుండా అనేక మంది చీము, నెత్తురుతో కలిసిన గాయాలతో ఆస్పత్రులకు వస్తుంటారు. వీరందరినీ పరీక్షించి మందులు రాసేది డాక్టర్. ఆపరేషన్లు చేసేది డాక్టర్. అయితే ఆ తర్వాత కోలుకోవడంలో, డ్రెస్సింగ్ చేసి గాయాలు మాన్పించడంలో ప్రధాన భూమిక పోషించేది నర్సులే.
నర్సింగ్ కోర్సులపై ఆసక్తి
నర్సింగ్ కోర్సులపై యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్‌డీ తదితర కోర్సులు అందించేందుకు ఇన్‌స్టిట్యూట్‌లు కూడా పోటీ పడుతున్నాయి.
కరీంనగర్/కోల్‌సిటీ(రామగుండం):ఒక డాక్టర్ ప్రాణాలు నిలబెడితే.. ఒక నర్సు తన సేవలతో రోగి ప్రాణానికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ఎంతో మంది నర్సింగ్ వృత్తిలోకి వచ్చి తమలోని సేవాతత్పరతను చాటుకుంటున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంకితభావం, నిబద్ధత, కృషికి గుర్తింపుగా ఆమె పుట్టిన రోజున ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


