10 సిలిండర్లు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

10 సిలిండర్లు పట్టివేత

Mar 19 2026 7:57 AM | Updated on Mar 19 2026 7:57 AM

కరీంనగర్‌ అర్బన్‌: వంటగ్యాస్‌ అక్రమ వినియోగంపై సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని హోటళ్లలో డొమెస్టిక్‌ గ్యాస్‌ వాడుతుండటంపై కన్నెర్ర చేశారు. సివిల్‌ సప్లయ్‌ డీటీ సురేందర్‌, ఎఫ్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి జ్యోతినగర్‌, మల్కాపూర్‌ రోడ్డు ప్రాంతాల్లోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తనిఖీ చేసి 10 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వంటగ్యాస్‌ వాడితే కేసులు నమోదు చేస్తామని వివరించారు.

జగిత్యాలలో 17 సీజ్‌..

6ఏ కేసు నమోదు

జగిత్యాలక్రైం: పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆ శాఖ అధికారులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 17 సిలిండర్లను పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశామని డీఎస్‌వో జితేందర్‌రెడ్డి తెలిపారు.

సీసీ కెమెరాలకు చిక్కిన పెద్దపులి

ఆవాసం ఏర్పర్చుకుందంటున్న గ్రామస్తులు

కొడిమ్యాల: మండలంలోని సూరంపేట, దమ్మాయిపేట శివారు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇక్కడే ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రైతు నరహరికి చెందిన ఆవును.. సోమవారం తేజావత్‌ గోరికి చెందిన చూడి ఆవును చంపిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో పులి మొదట చంపిన ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చింది. ఈ దృశ్యం సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యింది. పులి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండడంతో ఇక్కడే ఆవాసం ఏర్పరచుకుందని సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్‌ అధికారులను వివరణ కోరగా.. అలాంటిదేం లేదని రెండు రోజుల్లోగా పులి వేరేచోటుకు వెళ్లిపోతుందని తెలిపారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి

ఎమ్మెల్సీ రమణ

జగిత్యాల: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ రమణ కోరారు. శాసనమండలిలో మాట్లాడుతూ.. జగిత్యాల నియోజకవర్గంలో నిరుపేదలకు అందించిన ఇళ్ల వద్ద వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని, రవాణా సౌకర్యం కల్పించి పేదలను ఆదుకోవాలని కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ లేక ప్రజలు ఓటు వేసేందుకు కూడా రాలేదన్నారు. డంపింగ్‌యార్డు కారణంగా ప్రజలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

లింగ నిర్దారణ చేస్తే చర్యలు

ప్రోగ్రాం అధికారి జైపాల్‌రెడ్డి

జగిత్యాల: లింగ నిర్ధారణ చేస్తే చర్యలుంటాయని ప్రోగ్రాం అధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్‌ సెంటర్లను బుధవారం తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమన్నారు. స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రతినెలా 5లోపు ఫాం ఎఫ్‌ను సబ్మిట్‌ చేయాలన్నారు. సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ చేస్తే మూడు నెలల జైలు, రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట భూమేశ్వర్‌, శంకర్‌, రాజేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement