రాయికల్: పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో సౌకర్యాలు లేక మండలంలోని 32 గ్రామాల ప్రయాణికుల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాయికల్ మున్సిపాలిటీగా మారి ఆరున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ పాతబస్టాండ్‌లో మాత్రం కనీసం షెడ్ల నిర్మాణం లేకపోవడంతో ఎండాకాలంలో ఎండుతూ.. వర్షకాలంలో నానుతూ ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు కూర్చునేందుకు కనీసం బెంచీలు లేకపోవడంతో పరిసర దుకాణాల్లో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మూలుగుతున్న రూ.30 లక్షల నిధులు
బల్దియాలో బస్‌షెల్టర్ నిర్మాణం కోసం ఎన్‌సీసీఎల్ కింద రూ.30 లక్షలు మంజూరయ్యాయి. మున్సిపల్ మొదటి చైర్మన్ మోర హన్మండ్లు అప్పటి సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను కలిసి పట్టణంలో ఎన్‌సీసీఎల్ పథకం కింద రూ.30 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధుల ద్వారా బస్‌షెల్టర్, ఓపెన్‌జిమ్, పార్క్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ.. ఖర్చు చేయకపోవడంతో నిధులు బ్యాంక్‌లోనే మూలుగుతున్నాయి. మున్సి పల్ అధికారులు సంబంధిత అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు పంపించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. మరోవైపు ఆర్టీసీ కోరుట్ల, జగి త్యాల డిపో ల అధికారులు బస్‌షెల్టర్ నిర్మాణం కోసం పలు మార్లు పరిశీలించినప్పటికీ అది కాగి తాలకే పరి మితమయ్యాయి. నూతన పాలకవర్గ సభ్యులైనా పాతబస్టాండ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ ప్రాంతంలో షెల్టర్ నిర్మాణం చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
రాయికల్ పాతబస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు
షెల్టర్ కోసం రూ.30 లక్షలు మంజూరు
అధికారుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం
నూతన పాలకవర్గంతోనైనా మోక్షం లభించేనా..?


