మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారు
జగిత్యాలటౌన్: జగిత్యాల మున్సిపాలిటీలో పాలకమండలి ఐదేళ్ల పదవి కాలంలో 16మంది కమిషనర్లు మారడం దేశచరిత్రలోనే తొలిసారి అని, మూడుసార్లు ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణ లు, ఎనిమిది మంది బల్దియా ఉద్యోగులు అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లడం స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ నిర్వాకమేనని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోతున్నానని ఆరోపిస్తూ ఓ బీసీ బిడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేయడం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఉన్న మాటంటే ఎమ్మెల్యే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధు ల అనుమతితోనే ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణ జరుగుతాయని సంజయ్ వ్యాఖ్యానించడం ఏమిటని.. ఆయన అనుమతితోనే జగిత్యాలలో విచారణలు జరుగుతున్నాయా..? అని ప్రశ్నించారు. 16మంది కమిషనర్ల బదిలీ వెనుక ఎమ్మెల్యే ఉన్నారని భావించాలా..? అని నిలదీశారు. నోటికాడి పల్లెం ఎత్తుకెళ్లినట్లు పదేళ్లు కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లల్ల కట్టె పెట్టి.. పార్టీకోసం పనిచేసిన వారి శ్రమను దోపిడీ చేసే కుట్ర చేస్తూ అభివృద్ధి జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్నపాటి సవరణ చేయలేక మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చోవాల్సిన బీసీల హక్కును కాలరాసిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందని వ్యాఖ్యానించారు. నిబంధనల మేరకు పనులు చేయాలంటే తనను అభివృద్ధి నిరోధకుడు అంటున్న సంజయ్.. యావర్‌రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తానంటే ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. యావర్‌రోడ్డులోని ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించినా కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారులను అడ్డుకుంటున్న అదృశ్య శక్తి ఎవరో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిపై చర్చ జరుగుతుంటే జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి పై చర్చ సాగడం ఆయన పదేళ్ల పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పెట్రోల్ పంపు స్థలాన్ని బల్దియాకు స్వాధీనం చేయాలని, యావర్‌రోడ్డులో ఉన్న ఆక్రమణలు తొలగించి సంజయ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సమావేశంలో నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, దేవేందర్‌రెడ్డి, మన్సూర్, పిప్పరి అనిత, శీలం సురేందర్, రమేశ్‌బాబు, రఘువీర్‌గౌడ్, గుండ మధు, నేహాల్ తదితరులు ఉన్నారు.
జగిత్యాలను అవినీతి కేంద్రంగా మార్చారు
ఏసీబీ, విజిలెన్స్ విచారణ ఎమ్మెల్యే అనుమతితోనే జరిగాయా..?
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సంజయ్ ఉలిక్కిపడుతున్నడు
విలేకరుల సమావేశంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి


