నిధులు మంజూరు చేయండి
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కల్వ కుంట్ల సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు శుక్రవారం నిర్మల్ జిల్లా సదర్‌మాట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రిని ఎమ్మె ల్యే కలిసి అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై వినతిపత్రం అందజేశారు. సదర్‌మాట్ బ్యారేజ్ నుంచి ఇబ్రహీంపట్నం మండలంలోని గంగనాల ప్రాజెక్టుకు తూం ద్వారా నీరు అందించాలని తద్వారా 8 గ్రామాలకు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అదేవిధంగా కోరుట్ల, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు, మెట్‌పల్లి ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం, జూనియర్, డిగ్రీ కళాశాలలకు, కల్లూర్ లెవల్ వంతెనకు, పలు అసంపూర్తి రోడ్లు, వంతెనలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
రూ.కోటితో ఇంటర్‌లింకింగ్
ఇబ్రహీంపట్నం: మండలంలోని అన్ని సబ్‌స్టేషన్‌లకు 33కేవీ లైన్ ద్వారా నిరంతరం విద్యుత్ సరాఫరా చేసేందుకు రూ.1 కోటితో ఇంటర్ లింకింగ్ పనులు చేపట్టినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. శుక్రవారం మండలంలోని వేములకుర్తిలో ఇంటర్‌లింకింగ్ పనులను ప్రారంభించారు. ఎర్దండి సబ్‌స్టేషన్‌కు ఇబ్రహీంపట్నం ఫీడర్ నుంచి 33కేవీ లైన్, వేములకుర్తి సబ్‌స్టేషన్‌కు గోధూర్ నుంచి 33కేవీ లైన్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఇంటర్‌లింకింగ్ పనుల వల్ల మండలంలోని 5 సబ్‌స్టేషన్‌లకు నిరంతర విద్యుత్ సరాఫరా అవుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఈటీ అంజయ్య, డీఈ(ఆపరేషన్)లు గంగారం, మధుసుదన్, ఏడీ(ఆపరేషన్) అమరేందర్, ఏఈ సతీశ్, లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


